బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ సూసైడ్

బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ సూసైడ్

వరంగల్ సిటీ, వెలుగు: బీఎస్సీ అగ్రికల్చర్‌‌ చదువుతున్న ఓ స్టూడెంట్‌‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌‌ నగరం ములుగు రోడ్‌‌లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆవరణలోని అగ్రికల్చర్‌‌ కాలేజీలో బుధవారం జరిగింది. ఏనుమాముల సీఐ రాఘవేందర్, స్టూడెంట్‌‌ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన గుంటోజు రేష్మిత (18) ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వరంగల్‌‌లోని అగ్రికల్చర్‌‌ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతోంది. 

డిసెంబర్‌‌లో సీటు పొందిన రేష్మిత రెండు నెలల తర్వాత ఇటీవలే కాలేజీకి వచ్చింది. బుధవారం ఉదయం తన రూమ్‌‌లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటి తర్వాత గమనించిన తోటి స్టూడెంట్స్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా యువతికి చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.