
- పొరపాటున బార్డర్ దాటడంతో అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ
- పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో ఘటన
న్యూఢిల్లీ: భారత సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న పూర్ణం సాహు అనే జవాను పొరపాటున పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్లడంతో ఆ దేశ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకుంది. బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన సాహు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు సెక్యూరిటీగా బుధవారం విధులు నిర్వహిస్తున్నాడు. అలసటగా ఉండటంతో దూరంగా ఉన్న ఓ చెట్టు నీడలోకి వెళ్లాడు. అయితే, ఆ చెట్టు పాకిస్తాన్ భూ భాగంలో ఉండటంతో... ఆ దేశ ఆర్మీ పూర్ణం సాహును తమ అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని గురువారం ఇండియన్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.
ఆ వెంటనే పాక్‌తో ఇండియా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. మరోవైపు, పూర్ణం సాహును పాక్ బలగాలు అదుపులోకి తీసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డను పాక్ ఆర్మీ కస్టడీలోకి తీసుకొని మూడ్రోజులు అవుతున్నా... అతని క్షేమ సమాచారాలపై ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని సాహు తండ్రి బోల్‌నాథ్ సాహు అన్నారు. అతను బతికి ఉన్నాడా.. లేదా.. ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తాడని ప్రశ్నిస్తున్నారు. తన భర్త పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడని ఆయన స్నేహితుడు ఒకరు తనకు ఫోన్ చేసి చెప్పారని పూర్ణం సాహు భార్య ఆందోళన వ్యక్తం చేశారు. నాన్నకు ఏమైందని తన ఏడేండ్ల కుమారుడు అడుగుతుంటే.. ఏమీ సమాధానం చెప్పాలో తేలియడం లేదని ఆమె కన్నీరుమున్నీరవుతోంది.