ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్ర యూజర్లకు శుభవార్త చెప్పింది. నెట్వర్క్ అప్గ్రేడ్ పాలసీలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 5జీ- రెడీ సిమ్ కార్డ్స్ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ సిమ్ కార్డ్స్ను విడుదల చేశారు. బీఎస్ఎన్ఎల్ స్టోర్స్కు గానీ బీఎస్ఎన్ఎల్ ఆథరైజ్డ్ డీలర్స్ను సంప్రదించి గానీ ఈ 5జీ సిమ్ తీసుకోవచ్చు. 4జీ నుంచి 5జీకి త్వరితగతిన అప్ గ్రేడ్ చేస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇక.. బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన 5జీ సిమ్ లుక్ చూస్తే గతంలో ఉన్న సిమ్స్ కంటే భిన్నంగా ఉంది. భారత త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో 5G READY అక్షరాలను డిజైన్ చేశారు. మిగతా సిమ్స్లానే మూడు సైజుల్లో సిమ్ను తీసుకొచ్చారు. రెగ్యులర్, మైక్రో, నానో సైజుల్లో సిమ్ ఉంది. ఇప్పటికైతే బీఎస్ఎన్ఎల్ దేశంలో ఎక్కడా 5జీ సేవలను అందించడం లేదు. బీఎస్ఎన్ఎల్ 5జీకి అప్గ్రేడ్ అయిన అనంతరం ఇప్పుడు 5జీ సిమ్ తీసుకున్న వారికి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త సిమ్ కార్డ్ అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకునే 5G READY సిమ్ కార్డ్తో 5జీ స్పీడ్ ఇంటర్నెట్ను పొందొచ్చు. అయితే.. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్న ప్రీపెయిడ్ యూజర్లకు 5G READY SIMకు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉందో, లేదో ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.