ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 17 ఏళ్ల తర్వాత లాభాలు చూసిన బీఎస్ఎన్ఎల్

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 17 ఏళ్ల తర్వాత లాభాలు చూసిన బీఎస్ఎన్ఎల్

ఢిల్లీ: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 17 ఏళ్ల తర్వాత లాభాలను చూసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం ఫలితాల్లో బీఎస్ఎన్ఎల్ లాభాల బాటలో పయనించింది. డిసెంబర్ త్రైమాసికంలో 262 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ను బీఎస్ఎన్ఎల్ ఆర్జించినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 

ఇది బీఎస్ఎన్ఎల్కు ఒక చెప్పుకోతగిన టర్నింగ్ పాయింట్ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించడానికి, యూజర్లపై రీఛార్జ్ భారం తగ్గించడానికి, సబ్స్రైబర్లను పెంచుకోవడానికి ఈ పరిణామం మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2007లో ఒక త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ చివరిగా లాభాలను చూడగా.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు ఆ సంస్థ లాభాల్లో వృద్ధి కనిపించింది. బీఎస్ఎన్ఎల్ ఆదాయం 14 నుంచి 18 శాతానికి పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు మంచి రోజులొచ్చినట్టే అనిపిస్తుంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య కూడా జూన్, 2024లో 8.4 కోట్లు ఉండగా 2024, డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 9 కోట్లకు పెరిగింది.

బీఎస్ఎన్ఎల్ 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉన్న త్రైమాసికంలో 262 కోట్ల లాభం ఆర్జించడానికి కారణం లేకపోలేదు. భారత్ లో టాప్ టెలికాం రంగ సంస్థలుగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 2024 జులైలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో ఆల్ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో అయితే ఏకంగా అన్ని ప్లాన్ల ధరలను 25% వరకు అమాంతం పెంచేసింది.

ALSO READ | కస్టమర్లకు జియో ఝలక్.. రీఛార్జ్ ప్లాన్స్లో కీలక మార్పులు.. గట్టి దెబ్బే ఇది..!

ఎయిర్టెల్ కూడా జియో బాటలోనే నడిచి రీఛార్జ్ ప్లాన్ల ధరలను జియోతో పోటీ పడి మరీ పెంచింది. వీఐ (వొడాఫోన్ ఐడియా) కూడా ఇదే దారిలో నడిచింది. ఉన్నపళంగా రీఛార్జ్ ప్లాన్ల ధరలు అంతంత పెరిగే సరికి కొందరు కస్టమర్లకు కడుపు మండిపోయింది. కొందరు బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టేశారు. మరికొందరు కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నారు. ఇలా.. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడం బీఎస్ఎన్ఎల్కు బాగా కలిసొచ్చింది.

2024 జులై నుంచి నెలనెలా లక్షల్లో సబ్స్రైబర్లు పెరిగారు. ఇదే అదనుగా.. బీఎస్ఎన్ఎల్ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుని తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. డేటా సేవలను కూడా మెరుగుపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫలితంగా బీఎస్ఎన్ఎల్ 17 ఏళ్ల తర్వాత లాభాలు ఎలా ఉంటాయో చూసింది. బీఎస్ఎన్ఎల్పై ఇప్పటికీ ఉన్న విమర్శ ఒక్కటే. 
 

ఇతర టెలికాం కంపెనీల సేవలతో పోల్చుకుంటే హై స్పీడ్ డేటాను అందించే విషయంలో ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ వెనుకబడి ఉంది. అందుకే బీఎస్ఎన్ఎల్ ఆ దిశగా సేవలను మెరుగుపరుచుకునేందుకు దృష్టి పెట్టింది. లక్ష 4జీ టవర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. 2025 జూన్ నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్స్ అన్నీ యాక్టివ్ సేవలను అందించే విధంగా ప్రభుత్వం ముందుకెళుతోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.