
- కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: సుమారు 18 ఏండ్ల తర్వాత ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’(బీఎస్‌ఎన్‌ఎల్) తొలిసారి లాభాలు చూసినట్లు కేంద్రం వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బీఎస్‌ఎన్‌ఎల్ కు రూ.262 కోట్ల లాభం వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలు మొదలు మెట్రో నగరాల వరకు ప్రజలకు అందించిన సేవలే ఇంతటి లభానికి కారణమని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జే రవి వెల్లడించారు.
మొబిలిటీ సేవల ద్వారా 15శాతం ఆదాయం, ఫైబర్-టు- ది- హోం ద్వారా 18శాతం ఆదాయం, లీజ్డ్ లైన్ సేవల ద్వారా 14శాతం ఇన్ కం వచ్చిందన్నారు. 4జీ సేవలను విస్తరించడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని బలోపేతం చేయడం, నెట్‌వర్క్ సజావుగా పనిచేసేలా చూడటం, మొబైల్ కస్టమర్లకు ఉచిత వినోదం, డిజిటల్ కంటెంట్ అందించడం వంటివి సంస్థ లాబాల్లోకి రావడానికి ప్రధాన కారణంగా వివరించారు.