మంత్రులకు స్వేచ్ఛ లేదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా..ప్రగతి భవన్కు పోవాల్సిందే

 రూ.1.15 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కమీషన్ల కోసం సీఎం కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గోదావరి, మానేరు నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక క్వారీలన్నీ ఆధిపత్య వర్గాలకే దక్కుతున్నాయని విమర్శించారు.  అక్రమ ఇసుక రవాణా ద్వారా ఆధిపత్య వర్గాల కాంట్రాక్టర్లు రోజుకు రూ. 25 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలిపారు. తెలంగాన ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి..కోట్ల రూపాయలకు ప్రశ్న పత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ గోపికృష్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బహుజన మహిళా సదస్సుకు ముఖ్య అతిధిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. 

బిఆర్ఎస్ పార్టీ తొలి మంత్రి వర్గంలో ఒక్క మహిళా కూడా మంత్రి లేరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.  బిఆర్ఎస్ లో ఉన్న మహిళా మంత్రులకు స్వేచ్ఛ లేదన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రగతి భవన్ కు పోవాల్సిందే అని ఎద్దేవా చేశారు. 
  
బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఎకరం భూమి పంచి, మహిళల పేరు మీదనే పట్టాలిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామన్నారు.  అంతేకాకుండా రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి 5 లక్షల ఉద్యోగాలు మహిళకు కేటాయిస్తామన్నారు. సంపదలో సగభాగం మహిళలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు.  ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేసి..విద్యను ఉచితంగా అందిస్తామన్నారు. ప్రతి కుటుంబం నుండి నిరుపేద బిడ్డలను విదేశాల్లో చదివిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.