బీఆర్ఎస్​తో ఆర్ఎస్​పీ

  •  కేసీఆర్​తో భేటీ.. లోక్ సభ ఎన్నికలకు కుదిరిన పొత్తు 

హైదరాబాద్, వెలుగు:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్​లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన ఆర్ఎస్​పీ పొత్తులపై చర్చించారు. సమావేశం అనంతరం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇద్దరు నేతలూ ప్రకటించారు. బీఆర్ఎస్​లో చేరేందుకు ఆర్ఎస్​పీ సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేస్తూ మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.  

తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని, వాటిని నమ్మొద్దన్నారు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే తన ప్రయాణమన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపి పొత్తును కన్ఫమ్ చేశారు. అయితే, ఇన్నాళ్లూ కేసీఆర్​పై తీవ్ర విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే కేసీఆర్​తో జట్టు కడుతుండడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా ఆర్ఎస్​పీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.  

నాగర్ కర్నూల్ టికెట్ కన్ఫమ్?

అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ పీ మూడో స్థానానికే పరిమితమయ్యారు. రాజకీయంగా ఎదిగి చట్టసభల్లోకి వెళ్లాలంటే ఒంటరిగా పోటీ చేస్తే సరిపోదని ఆయన భావించినట్టు తెలుస్తున్నది. అందుకే బీఆర్ఎస్​తో పొత్తుకు సిద్ధమయ్యారని రాజ కీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. కేసీఆర్​తో చర్చల్లో నాగర్​కర్నూల్ టికెట్​ను ఆర్ఎస్​పీకి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని తెలుస్తున్నది.

 అది కాకుంటే వరంగల్​ నుంచైనా ఇచ్చేందుకు సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలా పడింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడం.. పార్టీపై నెగెటివిటీ కారణంగా పోటీ చేయడానికి పలువురు సీనియర్ లీడర్లు ముందుకు రాకపోవడంతో గులాబీ నేతలు ఆందోళనలో ఉన్నారు. అందుకే బీఎస్పీతో పొత్తుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు పొందొచ్చని కేసీఆర్ భావించినట్టు తెలుస్తున్నది.  

Also Read: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి

సిద్ధాంతపరంగా మేం ఒకటే.. 

సిద్ధాంతపరంగా బీఆర్ఎస్, బీఎస్పీ ఒకేలా ఉన్నాయని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ఆర్ఎస్​పీతో కలిసి ఆయన తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. పొత్తుపై బీఎస్పీ అధిష్టానం నుంచి ప్రవీణ్ కుమార్ అనుమతి తీసుకున్నారని చెప్పారు. బీఎస్పీ చీఫ్ మాయావతితో రేపో, ఎల్లుండో మాట్లాడతామన్నారు. సీట్ల సర్దుబాటు, విధివిధానాలపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు పోరాడిన నేత కేసీఆర్ అని ప్రశంసించారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ఆ పార్టీ బాటలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నదన్నారు. అందుకే బీఆర్ఎస్​తో కలిసి పోటీ చేస్తున్నామన్నారు. ఈ స్నేహం ప్రజల జీవితాలను బాగు చేస్తుందన్నారు.