హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు బీఎస్పీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆందోజ్ శంకరాచారికి టిక్కెట్ డిక్లేర్ చేసింది. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆందోజ్ శంకరాచారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్విట్టర్ లో తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి ఇంతవరకు ఒక్క బీసీ వ్యక్తి ఎమ్మెల్యే కాలేకపోయారని ఆర్ఎస్పీ అన్నారు. అందుకే తమ పార్టీ తరఫున బీసీని నిలబెట్టామని స్పష్టం చేశారు. ఆందోజ్ శంకరాచారి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.
నవంబర్ 3న జరిగే మునుగోడు ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి శంకరాచారిని గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెల 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా... ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తాజాగా బీఎస్పీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.