ఖమ్మం రూరల్, వెలుగు: అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అల్లిక వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలేపల్లిలో ఇండ్లు లేని నిరుపేదలను కాదని అనర్హులను కేటాయించారని ఆరోపించారు. ఇండ్లు రాని వారు కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ప్రైవేట్ పట్టా భూమిలో గుడిసెలో ఉంటున్న దాసరి రాములు లాంటి వారిని అనర్హులని పక్కన పెట్టారని ఆరోపించారు. వెంటనే అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాముని సన్నిధిలో భాగవత సప్తాహం షురూ
భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి నుంచి భాగవత సప్తాహం ప్రారంభమైంది. ఏఈవో శ్రావణ్‌కుమార్ వేదపండితులకు దీక్షా వస్త్రాలు అందించారు. శ్రీసీతారామచంద్రస్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విక్వరణం, అంకురారోపణం, వాస్తు హోమం, మండపారాధన జరిగాక పండితరత్న డా.ఆళ్వార్ భాగవత ప్రవచనం చేశారు. ఏడు రోజుల పాటు భాగవత పారాయణం జరగనుంది.
సెప్టెంబర్ 1 నుంచి టీచర్లకు ఇంగ్లిష్ ట్రైనింగ్
భద్రాచలం,వెలుగు: ఆశ్రమ, ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన దృష్ట్యా హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు, రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపోజల్స్ తయారు చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఆదేశించారు. తన ఛాంబరులో బుధవారం ఓఎస్డీ రాంలాల్, డీడీ రమాదేవి తదితరులతో రివ్యూ చేశారు. గిరిజన పిల్లలకు ఇంగ్లిషులో విద్యాబోధన చేసేలా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. వచ్చే నెల 1 నుంచి ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు. ఆన్లైన్ పాఠాలు చెప్పేలా పాఠశాలల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించి ఏసీఎంవో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ భూమి స్వాధీనం
పెనుబల్లి, వెలుగు: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని బుధవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని చింతగూడెం పరిధిలోని సర్వే నెంబర్ 71/3, 71/4 లో ఉన్న 3ఎకరాల 20 గుంటల భూమిని తహసీల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీనివాస్ స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేశారు. ఈ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చెరువులోకి దిగి వ్యక్తి మృతి
టేకులపల్లి,వెలుగు: మండలంలోని బోడు కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎట్టి లక్ష్మీనర్సు(55) కోయగూడెం ఓసీ సమీపంలో గేదెల కోసం చెరువులో దిగి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎట్టి లక్ష్మీనర్సు వ్యవసాయం చేసుకుంటూ గేదెలను మేతకు తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం ఓసీ వైపు మేతకు తీసుకెళ్లాడు. సమీప చెరువులోకి వెళ్లిన గేదెలను తెచ్చేందుకు చెరువులోకి దిగి నీటిలో మునిగి చనిపోయాడు. లక్ష్మీనర్సుకు భార్య, నలుగురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు.
‘మాతృశ్రీ’లో మహిళలకు సన్మానం
ఖమ్మం టౌన్,వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం సిటీలోని మాతృశ్రీ సంతాన సాఫల్య కేంద్రంలో బుధవారం పలువురు మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ వీరేశ్వర్ మాట్లాడుతూ మందులు, ఐవీఎఫ్, ఐయూఐ ప్రక్రియ ద్వారా సంతాన ప్రాప్తి కలిగిందని తెలిపారు. కొంత మందికి అధిక ఖర్చుతో కూడుకున్న ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ అవసరమైందన్నారు. డాక్టర్ నీరజ, ఎంబ్రియాలజిస్ట్ రాజేశ్, డాక్టర్ వెంకట్, డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఆంజనేయస్వామి ఆలయం మూత శఠారీకి సంప్రోక్షణ
భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఉపాలయం ఆంజనేయస్వామి గుడి తలుపులు తాత్కాలికంగా మూసేశారు. దేవస్థానం ఈవో శివాజీ స్వయంగా శఠారీ తీసుకుని శిరస్సుపై పెట్టుకోవడంతో వైదిక ఆచారాల ప్రకారం ఆలయం మూశారు. శఠారీకి సంప్రోక్షణ చేసిన అనంతరం తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. మంగళవారం సీఎల్పీ బృందం రామయ్యను దర్శించుకున్న సమయంలో లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వారికి కేశవనామార్చన చేశారు. అర్చన అనంతరం శఠారీ శిరస్సుకు తగల్లేదని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈవో బుధవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి శఠారీ శిరస్సుకు తగిలేలా పెట్టాలని, ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా తానే శఠారీ ఇచ్చుకున్నారు. వైదిక ఆచారాల ప్రకారం షర్టు ధరించిన వ్యక్తులు శఠారీని తాకరాదు. స్వయంగా ఇచ్చుకోకూడదు. అర్చకుడు జరిగిన విషయాన్ని స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ఆలయం మూసేసి, శఠారీకి సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత ఆలయం తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మెడికల్ కాలేజీ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ క్లాసులు ప్రారంభించేందుకు అవసరమైన భవనాలు, సౌకర్యాలపై కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్షించారు. బుధవారం త
న చాంబర్లో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కలెక్టరేట్ కాంప్లెక్స్, ఆర్అండ్ బీ ఆఫీస్‌ను కాలేజీకి కేటాయించారని, ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, ఫిజియోలజి, లెక్చర్ హాల్స్, రిసెప్షన్ హాల్ ల పనులను చేపట్టాలని అన్నారు. ఆర్అండ్ బీ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యాంప్రసాద్, టీఎస్ఎంఐడీసీ ఈఈ ఉమా మహేశ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ శ్రీధర్ బాబులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి టెర్రరిస్టుల మాదిరిగా తీసుకెళ్లడాన్ని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ అధ్యక్షుడు జావీద్ ఖండించారు. సిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భద్రాచలంలో అరెస్ట్ చేసి ఫారెస్ట్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం సరైంది కాదన్నారు. భద్రతా కారణాల రీత్యా అనుమతించడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో అక్రమాలు బయట పడతాయనే భయంతోనే తమ పార్టీ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. సయ్యద్ హుస్సేన్, ఏలూరి రవి పాల్గొన్నారు.
పంట నమోదు పక్కాగా ఉండాలి
కూసుమంచి, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏఈవోలు చేస్తున్న పంట నమోదును పక్కాగా చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ డీడీ బైరెడ్డి సింగిరెడ్డి చెప్పారు. బుధవారం మండలంలోని భగత్‌వీడు, జుజ్జల్‌రావుపేట, మల్లేపల్లి గ్రామాల్లో పంట నమోదును పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 30 వరకు పంటల నమోదు పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని ఏఈవోలకు సూచించారు. అనంతరం కూసుమంచి రైతువేదికలో నాలుగు మండలాల ఏవోలు, ఏఈవోలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఏడీఏ విజయచంద్ర, ఏవోలు వాణి, సీతారాంరెడ్డి, నాగేశ్వరరావు, నారాయణరావు పాల్గొన్నారు.
లింగగూడెంలో చోరీ
గుండాల, వెలుగు: మండలంలోని లింగగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి జాడి ప్రభాకర్ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రించగా, తలుపు పగలగొట్టి బీరువాలోని 6 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.2 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని
ఎస్సై తెలిపారు.
చోరీకి యత్నించిన వారికి దేహశుద్ధి
బూర్గంపహాడ్, వెలుగు: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి యత్నించిన ముగ్గురిని చితకబాది పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో చోరీకి యత్నిస్తున్నట్లు గుర్తించి స్థానికులకు సమాచారం అందించాడు. గ్రామస్తులతో కలిసి వారిని బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ధర్నా
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం వీఆర్ఏలు ధర్నా చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. వీఆర్ఏల జేఏసీ సహ అధ్యక్షుడు కొండయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మాచారి, నాగరాజు, నాగేశ్వరరావు, గణేశ్, లక్ష్మీనారాయణ, శివకుమార్ పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోవీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు.
ఆర్డీవో ఆఫీస్ ముట్టడి..
ఖమ్మం టౌన్: 24 రోజులుగా పే స్కేల్ అమలు చేయాలనే డిమాండ్ తో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం వీఆర్ఏలు ఆర్డీవో ఆఫీస్ ముట్టడిని చేపట్టారు. ఖమ్మం సిటీలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఉమ్మడి జిల్లాలోని వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ ప్రెసిడెంట్ చల్లా లింగరాజు, చైర్మన్ అజీజ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.పే స్కేల్ అమలు చేసేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆర్డీవో రవీంద్రనాథ్ కు వినతిపత్రం అందించారు. జిల్లా జనరల్ సెక్రెటరీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్, అన్వర్,
జానీ పాల్గొన్నారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలి
పాల్వంచ,వెలుగు: మహిళలు తమకు ఇష్టమైన రంగంలో ఎదగాలని తహసీల్దార్ రంగా ప్రసాద్ సూచించారు. పట్టణంలోని నవభారత్ ఒకేషనల్ సెంటర్ మహిళా సాధికార కేంద్రంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎంబ్రాయిడరీ, టైలరింగ్ తో ఉపాధి పొందాలని సూచించారు. నవభారత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి, లైజన్ ఆఫీసర్ ఖాదరేంద్రబాబు, అరుణ, వాసవి, రాణి అమ్ముద పాల్గొన్నారు.
దుప్పికి గాయాలు
జూలూరుపాడు, వెలుగు: దుప్పి దారి తప్పి పశువులు, మేకలతో కలిసి జనావాసాల్లోకి వచ్చి గాయాలపాలైంది. మండలంలోని పశువులు, మేకల కాపర్లు చీమలపాడు అటవీ ప్రాంతానికి వెళ్లగా, బుధవారం పశువులతో కలిసి దుప్పి గ్రామంలోకి వచ్చింది. కుక్కలు దుప్పి వెంట పడడంతో తప్పించుకొనే క్రమంలో ఫెన్సింగ్ తీగలు తలిగి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గ్రామస్తుల సహాయంతో ఫారెస్ట్ ఆఫీస్‌కు తరలించి చికిత్స చేయించారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇల్లందు,వెలుగు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం ఇల్లందు శివారులోని అటవీ ప్రాంతంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. బొమ్మనపల్లి ముర్రెడు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పట్టుకొని ఇల్లందు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.