పిల్లర్లు కుంగిన ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలె : ఎంవీ గుణ,జాగిరి రాజేశ్

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని, మేడిగడ్డలోని కాళేశ్వరం ప్రాజెక్ట్​ పిల్లర్లు కుంగిపోవడం ఇందుకు నిదర్శనమని బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్​ ఎంవీ గుణ, ఇన్​చార్జ్ జాగిరి రాజేశ్ ​అన్నారు. బుధవారం మందమర్రిలోని పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఈసీ మెంబర్ దేవునూరి సంపత్ తో కలిసి మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని, ఇందుకు కారణమైన సీఎం కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను జైలుకు పంపించాలని డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్ సర్కార్​ తప్పుడు నిర్ణయాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.లక్షా 11 వేల కోట్ల ప్రజాధనం నీళ్లలో పోసినట్లయ్యిందన్నారు.

మేడిగడ్డలో ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ చేసి కేసీఆర్​ ఆస్తులను జప్తు చేయాలన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల జాతర పేరుతో మంచిర్యాల జిల్లా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ ఇప్పుడు ఎం సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, రమేశ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.