ఎన్నికల ప్రచారం నిమిత్తం మునుగోడులో పర్యటిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సోలిపురం వాగులో నడిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరుపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సోలిపురం వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామంటూ ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఉప ఎన్నిక రాగానే కోటి రూపాయలతో క్యాంపు కార్యాలయం కట్టుకున్న రాజగోపాల్ రెడ్డి.. సోలిపురం గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి ఎందుకు వేయించలేదని ప్రశ్నించారు. ఏనుగు గుర్తుకు ఓటేస్తే రోడ్లు, బ్రిడ్జి వేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ ఊరి నుంచి అత్యవసర పరిస్థితిలో దవాఖానకు వెళ్లలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, చాలామంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. పేదల బతుకులు మారడం టీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు.
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. బీఎస్పీ అభ్యర్థి గా అందోజు శంకరా చారి ఉన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరుగనుంది. 6న ఓట్లను లెక్కించనున్నారు.