కరీంనగర్ లోని మానకొండూరు చెరువు కట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బీఎస్పీ జెండా గద్దెను కూల్చివేశారు. దీంతో బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మానకొండూరు మండలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా జెండా గద్దెను ఏర్పాటు చేసినట్లు బీఎస్పీ నేతలు చెబుతున్నారు. అయితే జెండా గద్దెను కూల్చడంతో బీఎస్పీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గద్దెను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళనల నేపథ్యంలో కరీంనగర్–వరంగల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బీఎస్పీ నాయకులను బలవంతంగా అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కూల్చిన జెండా గద్దెను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. బీఆర్ఎస్ నేతల పనేనని ఆరోపించారు. రాత్రికి రాత్రే జెండా గద్దెను కూలగొట్టడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.