సీఎం కేసీఆర్ ఆఫీసులో దొంగలు

  • కమీషన్ల కోసమే కాళేశ్వరం డిజైన్​ మార్చిన్రు
  • మందమర్రి సభలో బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో క్వశ్చన్​పేపర్లను అమ్ముకున్న దొంగలు సీఎం కేసీఆర్ ఆఫీస్​లో కూర్చొని ఉన్నారని బీఎస్పీ చీఫ్​ ఆర్.ఎస్​.ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పార్టీ జిల్లా ఆఫీస్​ను జిల్లా అధ్యక్షుడు గుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతు రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ నిర్వహించిన అనేక  పోటీ పరీక్షల క్వశ్చన్​పేపర్లను లీక్​ చేసిన దుర్మార్గులపై సర్కార్​ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వీరంతా సీఎం ఆఫీస్​లోనే ఉంటున్నారన్నారు. ప్రాణహిత, గోదావరి నదుల మధ్య ఉన్న  జిల్లాలో రైతులకు చుక్క సాగునీరందని దుస్థితికి ఇక్కడి లీడర్లే కారణమన్నారు. 

గత పాలకులు 2.5లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-–చేవేళ్ల ప్రాజెక్టును తుమ్మడిహెట్టి వద్ద నిర్మించే ప్రయత్నాలు చేశారన్నారు. అయితే కమిషన్లకు కక్కుర్తి పడిన తెలంగాణ సర్కారు తుమ్మడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద నిర్మించిందన్నారు.  సింగరేణి కంపెనీకి వస్తున్న లాభాలను సీఎం తన నియోజకవర్గమైన గజ్వేల్​, సిద్దిపేట జిల్లాలకు అక్రమంగా తరలించుకపోతున్నాడన్నారు. ఓపెన్​కాస్ట్ గనుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను ఇతర ప్రాంతాల వారికి ఇచ్చి స్థానికులకు  అన్యాయం చేస్తున్నారన్నారు. 2,500 మందికి పోడు భూముల పట్టాలిస్తానని, కేసులు సాకుగా చూపి కేవలం 200 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. బీఎస్పీ దేనికీ భయపడదని, అవసరమైతే  చావడానికైనా సిద్ధమేనన్నారు. తర్వాత మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీలో సమ్మె చేస్తున్న వోల్వో కాంట్రాక్ట్​ డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. లెదర్​ పార్కును విజిట్​చేశారు.  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా కన్వీనర్లు​ అర్చన, మద్దెల భవాని, వినోద, రాజేశ్​, కాదాసి రవీందర్, నిట్టురి సారయ్య, రాకేశ్​ పాల్గొన్నారు.