
- హ్యాట్రిక్ ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప
- చరిత్ర సృష్టిస్తానంటున్న బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్
- క్యాండిడేట్ల చరిష్మాకు పార్టీ క్యాడర్ అదనపు బలం
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (జనరల్) నియోజకవర్గంలో ఈసారి టఫ్ఫైట్తప్పేలా లేదు. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నారు. బీఆర్ఎస్, బీఎస్సీ, కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లకు సొంత చరిష్మాకు తోడు నమ్మకమైన క్యాడర్ అదనపు బలంగా కనిపిస్తున్నది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప.. బహుజన వాదంతో నీలి జెండా ఎగరవేయాలని బీఎస్సీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ పట్టుదలతో ఉన్నారు.
సిర్పూర్లో ఖాతా తెరిచి రాష్ట్రంలోని క్యాడర్లో జోష్ నింపాలని బీఎస్పీ శ్రేణులు, ప్రవీణ్ సొంత సైన్యం స్వేరోస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరికి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసు కెళ్తున్నారు.
కోనప్పకు గట్టి పట్టు
ఇప్పటి వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్అభ్యర్థి కోనేరు కోనప్పకు సిర్పూర్ వ్యాప్తంగా సొంత బలగం ఉంది. రెండు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్న ఆయనకు ప్రతి ఊరిలోనూ మద్దతుదారులు న్నారు. ముఖ్యంగా ‘అన్నదానం’ లాంటి కార్యక్రమాలు, పోడు భూముల పోరాటాలతో జనాలకు దగ్గరయ్యారు. 2004లో మొదటి సారి కాంగ్రెస్ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తర్వాత సొంత బలంతో 2014 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో సునాయాసంగా గెలిచారు.
రాజకీయ వ్యూహాలు రచించడంలో కోనప్ప దిట్ట. ప్రత్యర్థుల వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఎన్నికల్లో పైచేయి సాధి స్తూ వస్తున్నారు. పోలింగ్ దగ్గర పడే కొద్ది ప్రత్యర్థులను దెబ్బతీస్తూ వారి అనుచార గణాన్ని తమ వైపు తిప్పకోవడంలో కోనప్పది అందె వేసిన చెయ్యి. అయితే ఈసారి మాత్రం కోనప్పకు బీఎస్పీ, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది.
బహుజనవాదం కలిసొస్తుందా?
సిర్పూర్ నియోజకవర్గంలో 2 లక్షల 22 వేల 973 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.10 లక్షలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లే! అభ్యర్థుల విజయంలో వీళ్లదే కీలకపాత్ర. కొంతకాలంగా అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రవీణ్ కుమార్, దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నారు. బహుజనులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో పాటు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రవీణ్ మాట్లాడుతున్నారు.
ఈ బహుజన వాదం తనకు కలిసి వస్తుందనే నమ్మకంతో ప్రవీణ్ ఉన్నారు. నియోజకవర్గానికి ప్రవీణ్ కుమార్ కొత్త అయినప్పటికీ ఇక్కడే ఇల్లు తీసుకొని ప్రజలతో మమేకమవుతున్నారు. మరో వైపు గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్‌కుమార్ ఏర్పాటుచేసిన స్వేరోస్ ఇప్పటికే సిర్పూర్లో దిగి చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నది.
వారసత్వంపైనే హరీశ్ ఆశలు
బీజేపీ నుంచి బరిలో దిగుతున్న పాల్వాయి హరీశ్‌బాబు గట్టిపోటీ ఇవ్వబోతున్నారు. హరీశ్తల్లిదండ్రులు పురుషోత్తంరావు, రాజ్యలక్ష్మి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచారు. వారి నుంచి వారసత్వంగా వచ్చిన ఓటు బ్యాంకు హరీశ్‌కు కొండంత బలం కానుంది. తల్లిదండ్రులు చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ హరీశ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ ఓటు బ్యాంక్తోడైతే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన హరీశ్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తనకే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మూడోసారి బరిలో..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రావి శ్రీనివాస్‌కు పార్టీ ఓట్లే బలం. పదిహేను ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న శ్రీనివాస్2014 (టీడీపీ), 2018 (బీఎస్పీ) తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్‌నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు ఈయనకు సానుకూల అంశం. ఈయన మిగిలిన మూడు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆ అభ్యర్థినే విజయం వరించే అవకాశముంది.