119 సీట్లలో పోటీ చేస్తం.. బీసీలకు 60 శాతం సీట్లు ఇస్తం: ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో తాము119 సీట్లలో పోటీ చేస్తామని బీఎస్పీ స్టేట్​చీఫ్​ఆర్​ఎస్ ప్రవీణ్​ కుమార్​స్పష్టం చేశారు. ఇప్పటివరకు1300 అప్లికేషన్లు అందాయని, వాటిని స్క్రూటినీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బుధవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రవీణ్​కుమార్​ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల రోజులుగా సీఎం కేసీఆర్​జాడలేకుండా పోయారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని చిత్తుగా ఓడిస్తేనే తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కాళేశ్వరానికి ఫండ్స్​ఇచ్చిన కేసీఆర్​సర్కార్..​ సీతారామ ప్రాజెక్ట్​కు నామమాత్రపు నిధులిస్తుండటం దారుణమన్నారు. తన ఫాంహౌస్ లోకి నీళ్లు తెచ్చుకునేందుకు దాదాపు రూ. 2 వేల కోట్లతో రాత్రికి రాత్రే  కొండపోచమ్మ సాగర్​కు నిధులు శాంక్షన్లు ఇప్పించుకున్నారని విమర్శించారు. 

రూ. 1400 కోట్లతో కట్టిన సెక్రటేరియెట్​లో  కేసీఆర్​ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో కూర్చోలేదన్నారు. నిజాయతీగా పనిచేసే ఆఫీసర్లను లూప్​ లైన్​లో వేస్తూ, తన డబ్బుల పంపిణీకి సహకరించే ఆఫీసర్లతో ఎన్నికల్లో గెలుపొందాలని కేసీఆర్​చూస్తున్నారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్​ విభాగంలో తనకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్​ఆఫీసర్లను నియమించుకొని ప్రతిపక్షాల కదలికలను తెలుసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు అయిపోయేంత వరకు పోలీస్​ విభాగంలో రిటైర్డ్​ఆఫీసర్లను పక్కన పెట్టేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్రంలో 3 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన రూ.10 వేల కోట్లను కేసీఆర్​తన వద్దే ఉంచుకున్నారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం గూండాగిరికి మారుపేరుగా మారిందని, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు రాఘవ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణి డీఎంఎఫ్​టీ ఫండ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు మళ్లించడం అన్యాయమన్నారు. 

యెర్రా కామేశ్​ను గెలిపించాలి..

తాము అధికారంలోకి వస్తే కౌలుదారులకు న్యాయం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా, వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం12 వేల ఏసీ కోచింగ్​ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఏడాది క్యాలెండర్​ ఇయర్​ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ధరణిని రద్దు చేస్తామని వెల్లడించారు. బీసీలకు 60 శాతం సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అడ్వకేట్, పార్టీ జనరల్​సెక్రటరీ యెర్రా కామేశ్​​ను పోటీలో దింపినట్లు చెప్పారు. కామేశ్​​ను బహుజనులంతా కలిసి ఓటేసి అసెంబ్లీకి పంపించాలని కోరారు.

బహుజనులు కూలీలయ్యారు

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ర్టాలను ఇప్పటిదాకా ఆధిపత్య కులాలకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్ పాల్టీలే పాలించాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల పాలనలో బహుజనులు ఎక్కడున్నారని  ఆయన ప్రశ్నించారు. బహుజనులంతా అక్రమ కేసుల్లో నిందితులుగా, స్టేషన్లలో రౌడీ షీటర్లుగా, జైళ్లలో ఖైదీలుగా, బతుకమ్మ చీరల స్కీమ్ ల వద్ద లబ్ధిదారులుగా, కంపెనీల్లో కూలీలుగా మారారని ట్విట్టర్​లో ఆవేదన వ్యక్తం చేశారు.