చౌటుప్పల్, వెలుగు: సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెడతానని చెప్పడం ఒక డ్రామా అని, పేరుపెట్టినంత మాత్రాన బహుజనుల బతుకులు మారతాయా అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ లా చదివితేనే వారి జీవితాలు మారతాయన్నారు. దొరల పాలన పోవాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. శుక్రవారం బహుజన రాజ్యాధికార పాదయాత్ర రెండో రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెంలో ప్రారంభమై పెదకొండూరు వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 23 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని విమర్శించారు. రాజగోపాల్ కు వచ్చిన కాంట్రాక్ట్ ను మునుగోడు ప్రజలకు అకింతమివ్వాలని, ఆ కంపెనీలో మునుగోడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. దళితబంధు పేరుతో దళిత కుటుంబాల్లో సీఎం కేసీఆర్ చిచ్చు పెట్టాడని అన్నారు. నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వమంటే లిక్కర్ అందిస్తున్నాడన్నారు. అమ్ముడుపోయిన కమ్యూనిస్టులు తిరిగి తమ పార్టీలో చేరాలని సూచించారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు పల్లె లింగస్వామి, ఏర్పుల అర్జున్ తదితరులు ఉన్నారు.