భూనిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తిమ్మాపూర్, వెలుగు: భూ నిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 144వ రోజు గురువారం కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలంలోని వచ్చునూరు, నేదునూర్, నల్లగొండ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ గ్రామాల్లో పేదల భూములన్నీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యాయని, పరిహారం, ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ నియోజకవర్గంలో ఇంతటి దీనస్థితి నెలకొనడం సిగ్గుచేటన్నారు. వచ్చునూరులో పేదల ఇళ్లకు కనీసం ఇంటి నంబర్ లేదని, కరెంట్ కనెక్షన్ లేకుండా చీకట్లో బతుకుతున్నారని అన్నారు. ఇంటి నంబర్ అడిగితే లంచం అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భూనిర్వాసితులకు న్యాయం చేయకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.

ఇటీవల ప్రభుత్వం పోలీస్​కానిస్టేబుల్ పరీక్షల్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆర్మీలో కూడా లేనివిధంగా లాంగ్ జంప్ దూరాన్ని కేసీఆర్​ ప్రభుత్వం పెంచిందన్నారు. అభ్యర్థుల బాధలు మీకు తెలుసా, ఏనాడైనా మీరు దూకారా.. పరిగెత్తారా అని ప్రశ్నించారు. తక్షణమే పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డాను కరీంనగర్​కు తీసుకొచ్చి ఓటర్లను మోసం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న మెజారిటీ హిందువులు బీజేపీని నమ్మబోరని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఓట్ల కోసం ఊర్లకు రావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచందర్, మహిళా కన్వీనర్ శిరీష, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు ప్రభాకర్, స్వరూప, సుమలత తదితరులు పాల్గొన్నారు.