బీఆర్ఎస్ ​నేతలు దోచుకుతింటున్నరు

బీఆర్ఎస్ ​నేతలు దోచుకుతింటున్నరు

కాగజ్​నగర్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.  కేసీఆర్​ రూ.లక్ష కోట్లతో కట్టినట్టు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కన్నెపల్లి పంప్​హౌస్ ​గోడ కూలిందని, మోటార్లు మునిగిపోయి రూ.1300 కోట్ల నష్టం జరిగిందని, ఆ ప్రాంతాన్ని చూడనివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారన్నారు. రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్‌‌లో ఆయన రెండో రోజు పర్యటించారు. అంకుశాపూర్ లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. తాము అధికారంలోకి రాగానే సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. అందెవెళ్లి సమీపంలో పెద్దవాగుపై  ఇటీవల కూలిన బ్రిడ్జిని పరిశీలించారు. కట్టిన ఇరవై ఏండ్లకే బ్రిడ్జి కూలడం ఏమిటన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ పై కేసులు ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు లేకుండా పోయాయని, తన ఫోన్ హ్యాక్ ​చేసేందుకు సర్కార్ పూనుకోవడం తన హక్కుల్ని కాలరాయడమేన్నారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి , జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, నియోజక వర్గ ఇన్​చార్జి అర్శద్ హుస్సేన్, రామ్ ప్రసాద్, ప్రవీణ్, ఉన్నారు.

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దందా చేస్తున్నడు

దహెగాం :  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నోటిఫైడ్ భూములను కబ్జా చేస్తూ,పేదల భూములు ఆక్రమిస్తూ, గుట్కా, బియ్యం దందా నడుపుతున్నారని ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ఆరోపించారు. దహెగాం మండలంలో పర్యటించిన ఆయన అంగడి బజార్​లో మాట్లాడారు. తర్వాత అందెవెల్లి దగ్గర బ్రిడ్జిని పరిశీలించారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వంతెన కొద్దిరోజులకే కూలిపోవడానికి కారణాలేంటని ప్రశ్నించారు. తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు కూడా కూలడానికి సిద్ధంగా ఉందన్నారు. పత్తి ధర పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్​నియోజకవర్గాల్లోమాత్రం ఏసీ మార్కెట్లు కట్టుకుంటున్నారన్నారు. ఫామ్​హౌజ్​రోడ్డు అద్దం లెక్క మెరుస్తుంటే..మనపల్లెల రోడ్లు మాత్రం నడుములిరిగేట్టున్నాయన్నారు. నాయకులు నక్క మనోహర్,రేణికుంట్ల శ్రీనివాస్,కనక ప్రసాద్, శ్రీనివాస్,రాజేశ్​ పాల్గొన్నారు.