గడీల పాలనను తరిమిగొడతాం : ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు : తమకు అధికారం ఇస్తే రాష్ట్రం నుంచి గడీల పాలనను తరిమిగొడతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్  అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్  రెండూ ఒక్కటేనని, ఆ పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలను ఆయన కోరారు. ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచ్ లు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

వందల మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఏర్పడితే కేసీఆర్  తన తొమ్మిదేండ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని ఫైర్  అయ్యారు. కేసీఆర్  నియంతలా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని ఐదో వార్డు కౌన్సిలర్ కొంకమల్లు శ్రీలత, 22వ వార్డు కౌన్సిలర్ అన్నబోయిన లావణ్య, పారిగాం సర్పంచ్  దుర్కే లక్ష్మి, సిర్పూర్  తాలూకా బౌద్ధ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్  రత్నం బీఎస్పీలో చేరారు. 

వారికి పార్టీ కండువా కప్పి ఆర్ఎస్  పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు పాల్గొన్నారు.