నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మెడ గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అక్కడ కూలీ పని చేసుకునే మహిళలను ఆర్ఎస్ ప్రవీణ్ తన ఏసీ కార్ లో తిప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనీసం బైక్ లు కూడా లేకుండా ఎంతో మంది బహుజనులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ ఏసీ కార్లలో తిరిగేలా ఆర్ధికంగా బలోపేతం చేయడమే తమ ధ్యేయమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను రాజకీయ పార్టీలు ఓటు యంత్రాల్లా చూస్తున్నాయని మండిపడ్డారు.
మునుగోడు నియోజవర్గంలో బీఎస్పీ తప్ప.. ఏ పార్టీ కూడా బీసీలకు టిక్కెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. బీఎస్పీ అభ్యర్థి ఆందోజ్ శంకరాచారిని గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.