శాంతినగర్, అలంపూర్, వెలుగు: రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కాకుండా బహుజన రాజ్యం రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ లోని భవాని ఫంక్షన్ హాల్లో జరిగిన బహుజన మహిళా గర్జన లో ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శాంతినగర్ సెంటర్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం, రామ రాజ్యం, రాజన్న రాజ్యం, తర్వాత బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ రాజ్యం చూశామన్నారు. కేసీఆర్ రాజ్యంలో నీళ్లు అంటే కన్నీళ్లు, నిధులు అంటే గుప్తనిధులు, నియామకాలు అంటే కుటుంబ నియామకాలు అని విమర్శించారు. ఇలాంటి రాజ్యం మనకు వద్దన్నారు. ఇప్పటివరకు ఓట్లేసి గెలిపించిన నాయకులంతా కోట్లు సంపాదించారని, పేదలకు మాత్రం ఏం చేయలేదన్నారు. అందుకే బహుజన రాజ్యం రావాలన్నారు. బీజేపీ నాయకులు దళితుల ఇళ్లలో బస చేయడం కాదని, దమ్ముంటే మీ ఇంటికి ఆహ్వానించాలని అన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే కాలనీ మునిగింది
రాష్ట్రంలోని ప్రజా సమస్యలను కేసీఆర్పట్టించుకోవడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గతవారం కురిసిన భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని అక్బర్ పేట కాలనీ నీట మునిగింది. సోమవారం అక్బర్ పేట కాలనీలో ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే అక్బర్ పేట కాలనీ జలమయం అయిందన్నారు. కాలనీలో సీసీ రోడ్లు నిర్మించారని, కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరిందన్నారు. తడిసిన ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. అలంపూర్ పట్టణానికి పక్కనే తుంగభద్ర నది ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మరింత వరద వచ్చే అవకాశముందన్నారు. పట్టణంలో 1979లో కోట గోడ నిర్మించారని, ఆ గోడ నుంచి నీళ్లు పోవడానికి మోటార్లు కూడా పనిచేయడం లేదన్నారు. ఊరు చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని చెప్పారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన అక్రమ కట్టడాలను తొలగిస్తామని, అలంపూర్ పట్టణంలో చుక్క నీరు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా మంజూరైన రూ. 36 కోట్లు పాలకులు ఏ విధంగా ఖర్చు చేశారో చూపించాలని డిమాండ్చేశారు. అనంతరం పట్టణంలోని వీఆర్ఏల ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు వారికి బీఎస్పీ అండగా ఉంటుందన్నారు.