కేటీఆర్ నియోజకవర్గంలోనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్​, టాయిలెట్స్ లేవు
  • బీజేపీ, బీఆర్ఎస్​ మిలాఖత్​అయ్యాయి 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్‌నగర్, వెలుగు : రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా  నాశనమైందనీ, ప్రభుత్వ స్కూళ్లలో మిడ్​డే మీల్స్​ క్వాలిటీ లేక ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్‌కుమార్​ పేర్కొన్నారు. సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి సొంత  నియోజకవర్గంలోనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం కాగజ్‌నగర్‌‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, మంత్రుల పిల్లలు సౌలత్‌లు లేని ఇలాంటి స్కూళ్లలో చదువుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వందల ప్రభుత్వ స్కూళ్లలో వసతులు లేవని, టాయిలెట్స్ లేక ఒంటికి, రెంటికీ  విద్యార్థులు గోస పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్‌వాడీ సెంటర్లలో కనీసం కరెంట్ సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్​పేదల సొమ్మును దోచుకోవడంలో మిలాఖత్ అవుతాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో పేదల కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును రూలింగ్​పార్టీ లీడర్లు దోచుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో  రూ.వందలకోట్ల విలువైన భూముల్లో ఆధిపత్య వర్గాల వారికి భవనాలు కట్టించి,  బడుగు వర్గాలకు సిటీ బయట కట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యం వస్తే బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. ఫాంహౌస్‌లో పండే పంటకు ఒక రేటు, పేదలు పండించే పంటలకు తక్కువ ధర ఎందుకుందని ప్రశ్నించారు.  సిర్పూర్​నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు సరిగా లేక, అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని.. దీనికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి, నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ అధ్యక్షుడు రాంప్రసాద్, దుర్గం ప్రవీణ్, మహేశ్​ పాల్గొన్నారు.