అబద్ధాలు బీఆర్ఎస్ అధికారిక భాష
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు : అబద్ధాలు మాట్లాడడం బీఆర్ఎస్ అధికారిక భాష అని, రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో చేపట్టిన యాత్ర అయిదో రోజుకు చేరుకుంది. శుక్రవారం పెంచికల్ పేట్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ పేరుతో పేదల భూములు గుంజుకుంటున్నారని, కామారెడ్డి రైతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.
రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో డెడ్ బాడీని 15 రోజులు మార్చురీలో పెట్టిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఇవ్వకుండానే ఇచ్చామని, వందలకోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.