చండూర్, నల్గొండ జిల్లా: తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బహుజలకు బీఎస్పీ పార్టీ అండగా నిలుస్తుందని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దోపిడి, అణచివేతల నుంచి బయటపడేందుకు మునుగోడు ఉప ఎన్నిక స్థానికులకు చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన బీఎస్పీ పార్టీ తరపున అభ్యర్థి ఆందోజు శంకరాచారి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా చండూర్ లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వెట్టి నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖులు, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ర్యాలీ సాగింది. జనం గుమిగూడిన కూడలి ప్రాంతంలో టాపులేని వాహనం పై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
బహుజనులు ఎక్కువగా ఉన్నా పాలకులు అగ్రకులాలే
మునుగోడు నియోజకవర్గంలో బహుజనులు ఎక్కువగా ఉన్నప్పటికీ అగ్రకుల నాయకులు ఇక్కడ పాలిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్రకుల నాయకుల చేతిలో బహుజనులను అణిచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా అగ్రకుల నాయకులు మునుగోడు నియోజకవర్గాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దోపిడి దొంగల్లాగా వచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. అణచవేతలు, దోపిడీలకు గురైన వారికి బీఎస్పీ అండగా నిలుస్తుందని.. ఉప ఎన్నికలో బీఎస్పీ బరిలో ఉండడం చక్కటి అవకాశంగా భావించి వినియోగించుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు.