
సూర్యాపేట: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిగుడుపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి (21) రామాపురంలోని గేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి తల్లితో కలిసి శుక్రవారం (ఏప్రిల్ 18) రోజే కాలేజీకి వచ్చింది. తల్లితో కలిసి కాలేజీ హాస్టల్లో నిద్రించిన కృష్ణవేణి.. శనివారం (ఏప్రిల్ 19) తెల్లవారుజామున వాష్ రూమ్‌కి వెళ్తున్న చెప్పి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిలుకూరు ఎస్సై రాంబాబు దర్యాప్తు చేపట్టారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాత్రి వరకు పక్కనే ఉన్న కూతురు విగతజీవిగా మారడంతో మృతురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.