నెల్లికుదురు, వెలుగు: లోన్ యాప్ సంస్థ వేధింపులతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బోటిమీది తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొండేగలగుట్ట తండాకు చెందిన బానోత్ కిషన్ కొడుకు బానోతు ఆకాష్ (22) హైదరాబాద్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం రాత్రి స్వగ్రామానికి వచ్చిన ఆకాష్ తన తండ్రి బానోతు కిషన్ కు తాను ఓ లోన్యాప్నుంచి రూ.30 వేలు తీసుకున్నానని, వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్నారని చెప్పి బాధపడ్డాడు. మహిళా మండలిలో లోన్ వచ్చేది ఉందని, రాగానే ఇస్తానని తండ్రి చెప్పాడు.
రాత్రి ఆకాష్ ఇంట్లో పడుకోగా, కుటుంబసభ్యులు బయట పడుకున్నారు. ఉదయం లేచి ఇంట్లోకి వెళ్లేసరికి ఆకాష్ స్లాబ్ కొక్కానికి ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. ఏఎస్ఐ వెంకన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు.