
- నాలుగు కిలోల మాల్ స్వాధీనం
- జేఎన్టీయూ వద్ద 119 కిలోల గంజాయి స్వాధీనం
- ఒకరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పట్టుబడుతున్నా దందా ఆపకుండా గంజాయి అమ్ముతున్న ఒకరిని, మరో ముగ్గురు బీటెక్ స్టూడెంట్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో రూ.60లక్షల విలువైన 119 కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ సీజ్‌చేశారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి సోమవారం హైదరాబాద్ నాంపల్లి లోని ఎక్సైజ్ భవన్ లో వివరాలు మీడియాకు వెల్లడించారు.
జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో ముగ్గురు వ్యక్తులు 115 కిలోల గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్–సి టీమ్ లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివ సిద్దు, టీమ్ పోలీసులు రైడ్చేశారు. ఇద్దరు పారిపోగా, ఒకరు చిక్కారు. నిందితుడిని దుగ్యంపూడి శివ శంకర్‌రెడ్డి అలియాస్ శివారెడ్డిగా గుర్తించారు.
ఇతడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడుకు చెందిన వాడు.. ఇతడు ఒడిశా నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలుసుకున్నారు. నిందితుడిపై కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి. మరో కేసులో కేపీహెచ్‌బీ వసంతనగర్ కాలనీలో ముగ్గురు బీటెక్ చేస్తూ పార్ట్‌టైం జాబ్స్చేస్తున్నారు. రెంట్‌కు ఉన్న ఇంట్లో గంజాయి అమ్ముతున్నారు. వీరి ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు.
నిందితులను కరీంనగర్ జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన రాహుల్, పెద్దపల్లి జిల్లా భూంనగర్ వాసి పరికిపండ్ల అజయ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలానికి చెందిన తాడిపల్లి అభిలాశ్‌గా గుర్తించారు. నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోని నిందితులపై బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తుల శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.