
- ఒకరి డెడ్‌బాడీ లభ్యం, మరొకరికి కోసం గాలింపు
- యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘటన
- మెదక్ జిల్లా నర్సాపూర్ రాయరావు చెరువులో పడి మరొకరు..
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. ఇందులో ఒకరి డెడ్‌బాడీ దొరకగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గంధ జతిన్ (18), బొడ్డు శ్యాంచరణ్ (18), చల్లా అక్షయ్‌రెడ్డి, వర్జల శ్రీమాన్, భరత్ అనే యువకులు దేశ్‌ముఖి గ్రామ పరిధిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్‌ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.
బుధవారం ఎగ్జామ్‌కు హాజరైన ఐదుగురు ఐదు నిమిషాల్లోనే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత మద్యం సేవించి కాలేజీ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. జతిన్, శ్యాంచరణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఇద్దరూ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మిగిలిన ముగ్గురిలో ఓ స్టూడెంట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగతా ఇద్దరు కలిసి నీటిలో ఎంత వెదికినా జతిన్, శ్యాంచరణ్ ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి నీటిలో గాలించారు. సుమారు ఐదు గంటలు గాలించి శ్యాంచరణ్ డెడ్‌బాడీని బయటకు తీశారు. జతిన్ కోసం గాలిస్తున్నారు.
చెరువులో పడి...
నర్సాపూర్, వెలుగు : చెరువులో జారి పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువు వద్ద బుధవారం జరిగింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన బెల్లం మనీశ్ (20) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం ఆరుగురు ఫ్రెండ్స్‌తో కలిసి నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువు వద్దకు వచ్చారు.
మనీశ్‌తో పాటు మరో ఇద్దరు చెరువు తూముపై
కూర్చొని ఉండగా, మిగతా వారు బిర్యానీ తీసుకొచ్చేందుకు నర్సాపూర్ పట్టణానికి వెళ్లారు. తూము మీద కూర్చున్న మనీశ్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. గమనించిన ఇద్దరు ఫ్రెండ్స్ మనీశ్‌ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా మనీశ్ డెడ్‌బాడీ దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింగం తెలిపారు.