వెలుగు సక్సెస్: బౌద్ధ సంగీతులు

వెలుగు సక్సెస్: బౌద్ధ సంగీతులు

భారతదేశంలోనూ ప్రపంచంలోనూ క్రీ.పూ. ఆరో శతాబ్దాన్ని కొత్త మతాలకు, విప్లవాత్మక మార్పులకు సూచికగా చెప్పవచ్చు. ఈ కాలంలో భారతదేశంలో 62 మత శాఖలు ఏర్పడ్డాయి. ఈ 62 మత శాఖల్లో బౌద్ధం ఒకటి. ఈ మత స్థాపన మగధలో జరిగినా పరిపూర్ణ అభివృద్ధి కోసలలో జరిగింది. ప్రపంచ చరిత్రలోనే మొదటి మత సంస్థ బౌద్ధం. దీనికి గల పేరు సంఘ. దీనిని ప్రజాపతి గౌతమి, ఆనందుడి కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. బుద్ధుని అసలైన ఐదుగురు శిష్యుల్లో ఒకడైన అస్సాజి  తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర, మొగ్గల్లన బౌద్ధ మతంలోకి 
మార్చబడ్డారు.

బుద్ధుని ఇతర అనుచరులు

ఆనంద (బుద్ధుని సహచరుడు, ముఖ్య శిష్యుడు), కాశ్యప (బుద్ధుని శిష్యుల్లోకెల్లా ముఖ్య పండితుడు), ఉపాలి (మంగలి కులం), యస (అత్యంత ఐశ్వర్యవంతుడు) 
బౌద్ధం స్వీకరించేవారు చేయాల్సినవి: 15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించడాన్ని పబ్జజవ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించడం, కేశఖండన పాటించడం, భిక్షువుల వద్ద ఉండాల్సిన రెండు జతల కాషాయ రంగు వస్త్రాలు, ఒక సూది, దారం, భిక్షపాత్ర, బుద్ధం శరణం గచ్చామి 
స్మరించడం.

బౌద్ధ సంఘంలోనికి రాకూడని వారు: బానిసలు, సైనికులు, నేరగాళ్లు, రోగగ్రస్తులు, రుణగ్రస్తులు, ప్రభుత్వోద్యోగులు. సంఘంలో గొప్ప వైద్యుడైన జీవకుడి చేరికను బుద్ధుడు నిరాకరించాడు. 
బౌద్ధ భిక్షువులు త్యజించాల్సిన అంశాలు: దొంగతనం, శృంగారంలో పాల్గొనడం, అబద్ధం చెప్పడం, మత్తు పదార్థాలను వాడటం, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం, సుంగధపూరిత వస్తువులు వాడటం, ఆహ్లాద కార్యకలాపాలకు దూరంగా ఉండటం, ఆభరణాలను ధరించడం.

స్త్రీ సన్యాసినులకు సంబంధించినవి: తొలుత బౌద్ధ సంఘంలోకి స్త్రీలు ప్రవేశించరాదనే నియమం ఉండేది. కానీ ప్రజాపతి గౌతమి, ఆనందుడు గట్టి పట్టుపట్టడంతో బౌద్ధ సంఘంలోకి స్త్రీలను అనుమతించారు. మహిళా బౌద్ధ సన్యాసినులను భిక్షుణి లేదా భిక్కుని అంటారు. సంసార జీవితాన్ని గడిపే మహిళా బౌద్ధ సన్యాసినులను ఉపాసిక అంటారు. 1. గర్భవతిగా ఉన్న స్త్రీ బౌద్ధ సంఘ ప్రవేశానికి అనర్హురాలు. 2. పసిపిల్లలు గల స్త్రీకి ప్రవేశం లేదు. 3. భర్త లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరం. 

మొదటి బౌద్ధ సంగీతి

మొదటి సమావేశం ముఖ్యోద్దేశం బుద్ధుడి బోధనలను గ్రంథ రూపంలోకి మార్చడం. ఈ సంగీతిలోనే బుద్ధుడి ఉపన్యాసాలన్నింటినీ ఆనందుడు సుత్తపీటక రూపంలో రాశాడు. బుద్ధుడి శిష్యుడు ఉపాలి వినయ పీటక రాశాడు. ఈ గ్రంథాల్లో ఆనందుడు బౌద్ధ నిర్వాణం కోసం రాజగృహ, కాశీ, శ్రావస్తీ, చంప, కౌశాంబి, సాకేత అనే ఆరు నగరాలను తరచూ పేర్కొన్నాడు. కానీ బుద్ధుడు కుషీ నగరాన్ని ఎంపిక చేసుకున్నాడు. 

రెండో బౌద్ధ సంగీతి

అవంతి సన్యాసులు(పశ్చిమ భారతదేశం), వజ్జి సన్యాసుల(తూర్పు భారత్​) మధ్య ఏర్పడిన సిద్ధాంతపరమైన సమస్యలను తొలగించడానికి రెండో సమావేశం సబాకాహి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధమతంలో చీలిక వచ్చింది.

మూడో బౌద్ధ సంగీతి

స్థవిరవాదులను నిజమైన బౌద్ధ సన్యాసులుగా మొగ్గలిపుత్త తిస్స పేర్కొన్నాడు. ఈ బౌద్ధ సంగీతిలో అభిధమ్మ పీటకను సంకలనం చేయడంలో మొగ్గలిపుత్త తిస్స లేదా ఉపగుప్తుడు కీలక పాత్ర పోషించాడు. మొగ్గలిపుత్త తిస్సను  శ్రీలంక అశోకుడిగా పిలుస్తారు. ఇందులో భాగంగానే బౌద్ధమతం దేశంలోనూ విదేశాల్లోనూ ప్రచారం చేయడానికి మహామాత్రలు ఏర్పడ్డాయి.

నాలుగో బౌద్ధ సంగీతి

ఈ బౌద్ధ సంగీతి జరిగే కాలం నాటికి బౌద్ధమతం 18 శాఖలుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన 18 మత శాఖల మధ్య సయోధ్య కుదర్చడానికి నాలుగో బౌద్ధసంగీతిని ఏర్పాటు చేశారని హుయాన్​త్సాంగ్​ తన రచనల్లో పేర్కొన్నాడు. ఈ సమావేశంలో 18 శాఖలను ప్రధానంగా రెండు శాఖలుగా మార్చారు. అవి.. హీనయానం, మహాయానం. ఈ సంగీతిలోనే వసుమిత్రుడు మహావిభాస శాస్త్ర అనే గ్రంథాన్ని రచించాడు. 

వజ్రాయనం

ఈ బౌద్ధ శాఖకు మరోపేరు తాంత్రిక బౌద్ధం. దీనిని ఐదో శతాబ్దానికి చెందిన సిద్ధ నాగార్జునుడు స్థాపించాడు. వజ్రాయానం మొదట్లో బెంగాల్​, బిహార్​ ప్రాంతాల్లో విస్తరించింది. దీనికి ముఖ్య  కేంద్రంగా విక్రమశిల విశ్వవిద్యాలయం వర్ధిల్లింది. దీనిని పాలవంశం రాజులు పోషించారు. అతీశ దీపాంకర వజ్రయాన మత ప్రచారం కీలక పాత్ర పోషించారు. వజ్రయానంలో బోధిసత్వులతోపాటు వారి భార్యలైన తారలను కూడా పూజిస్తారు. ఇందులో బుద్ధుడి అతీంద్రియశక్తులకు అధినేతగా పూజిస్తారు. వజ్రయానంలో కూడా రెండు మతశాఖలు ఉన్నాయి. అవి.. 1. కాలచక్రయానం. 2. సహజయానం.

1. కాలచక్రయానం: కాలచక్రయానంలో మంజుశ్రీ మూలకల్ప కీలకపాత్ర పోషించింది. ఎవరికైతే మంత్రశక్తులు ఉంటాయో వారికి మాత్రమే మోక్షం  లభిస్తుంది. వజ్రయానం ప్రకారం బుద్ధుడు సారనాథ్​లో మొదటి ప్రవచనం చేయలేదు. అమరావతిలో చేశాడు.
2. సహజయానం: దీని ప్రకారం మోక్షం పొందాలంటే వారు లైంగిక వాంఛలు తీర్చుకోవాలి. ఈ శాఖ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సంఘాలు వేశ్యగృహాలుగా మారిపోయాయి.