
- కొనియాడిన దక్షిణాసియా దేశాల బౌద్ధ భిక్షువులు
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనంలో సిద్ధార్థుని జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు కొనియాడారు. అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవంలో భాగంగా మనదేశంతో పాటు, దక్షిణాసియా దేశాల బౌద్ధ భిక్షువులు శనివారం బుద్ధవనం ఎంట్రెన్స్ నుంచి ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాస్తూపంలోని ఆచార్య నాగార్జునుడి శిల్పం, మహాస్తూపంలో అలంకరించిన శిల్పాలు, బుద్ధుడి పాదాలు, బుద్ధ చరితవనం, శ్రీలంక బహూకరించిన ఆవుకన బుద్ధుడి శిల్పంతో పాటు 14 నమూనా స్తూపాలని సందర్శించారు. బుద్ధవనం కన్సల్టెంట్ చరిత్ర పరిశోధకులు, బౌద్ధ నిపుణుడు శివనాగిరెడ్డి బుద్ధ వనంలోని వివిధ విభాగాలను, అక్కడి శిల్పాల విశేషాలను వివరించారు. నాగార్జునుడి కాంస్య విగ్రహం వద్ద ఆయన రాసిన బౌద్ధ తాత్విక గ్రంథాలు, మాధ్యమిక ధన్యవాదాల గురించి చెప్పారు. బుద్ధవనం పై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.
ఆ తర్వాత బౌద్ధ భిక్షువులు శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన గంటను మోగించి బుద్ధవనం పర్యటనను ముగించారు. అనంతరం నాగార్జున కొండను సందర్శించగా అక్కడి బౌద్ధ ప్రదర్శనశాలలోని శిల్పాల గురించి మ్యూజియం అధికారి కమలహాసన్ వివరించారు. కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార అధ్యక్షుడు కశ్యప బంతే, ఆనంద బంతే, సంఘపాల బంతే, శ్రీలంక్, మయన్మార్, లావోస్, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్ దేశాల బౌద్ధ భిక్షువులు, అమెరికాకు చెందిన అంతర్జాతీయ త్రిపిటక పఠనమండలి వ్యవస్థాపకురాలు వాంగ్మే డిక్షీ, సభ్యులు నెల్సన్, బుద్ధవనం ఆఫీసర్లు శ్యాంసుందర్‌రావు, శాసన రక్షిత, రవిచంద్ర, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.