వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు

వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు

తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరి, నేలకొండపల్లి, లింగాలమెట్ట, పెద్దబంకూరు, కోటిలింగాలలో బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి. ఫణిగిరిలో బయటపడిన శిథిలాల్లో బుద్ధుని పాదాలు, ధర్మచక్రం కూడా బయటపడటంతో తెలంగాణలో కూడా ప్రాచీనకాలం నుంచి బౌద్ధమతం వర్ధిల్లిందని భావించవచ్చు. బౌద్ధమతం గౌతమి బుద్ధుడి కాలంలోనే తెలంగాణలో ప్రవేశించిందనేది నిర్వివాదాంశం. 

బౌద్ధ వాజ్మయంలోనూ ఆ తర్వాత కాలంలో ఏర్పడిన షోడశ మహాజనపదాలైన అస్మక రాజ్యంలో తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతాలు ఉన్నాయి. బుద్ధుని సమకాలీనుడైన బావరి అనే బ్రాహ్మణుడు కరీంనగర్ జిల్లా ములక ప్రాంత నివాసి. ఈయన గౌతమ బుద్ధుని గురించి తెలుసుకుని తన 16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపించాడు. ఈ 16 మంది శిష్యులు శ్రావస్తిలో నివసిస్తున్న బుద్ధుడిని కలిసి, అతని సిద్ధాంతాలతో ప్రభావితులై బౌద్ధ మతాన్ని స్వీకరించారు.

 కొంత కాలం తర్వాత పింగియా లేదా కౌండిన్య అస్మక రాజ్యానికి తిరిగి వచ్చి బుద్ధుడి సిద్ధాంతాలను భావరికి వివరించాడు. దీంతో బౌద్ధ మతం పట్ల ప్రభావితుడైన భావరి బౌద్ధ మతాన్ని స్వీకరించి అస్మక రాజ్యంలో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతమైన విమానవత్తు అనే వ్యాఖ్యాన గ్రంథం పోతల్లి రాజధానిగా చేసుకొని అస్మక ప్రాంతాన్ని పాలించే రాజు తన కుమారుడితో కలసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడని, గౌతమ బుద్ధుని ముఖ్య శిష్యుడైన మహాకాత్యాయనుడు తథాగతుడి మహాపరినిర్వాణం తర్వాత వారికి దీక్ష ఇచ్చాడని ఉంది. అస్మక దేశం గోదావరి నది ఒడ్డున ఉన్న కవిత వనంలో ఉన్నట్లుగా జాతక కథల్లో పేర్కొన్నారు.  

నాగార్జునకొండ

ఆనాటి శ్రీపర్వతం–విజయపురి ప్రాంతాన్ని ప్రస్తుతం నాగార్జునకొండగా పిలుస్తున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాల్లో ఇది ఒకటి. గుంటూరు, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో నాగార్జునకొండ ఉంది. ఇక్కడ బుద్ధుడి ధాతుగర్భ స్తూపం ఉంది. బౌద్ధ నిర్మాణాలతోపాటు అనేక వైదిక నిర్మాణాలు ఉన్నాయి. ఇక్ష్వాకుల కాలంలో రాజధానిగా ఉండి అనేక హిందూ ఆలయాల నిర్మాణాలకు కేంద్రమైంది. కాబట్టి నాగార్జునకొండను లౌకిక నిర్మాణాలు ఉన్న ప్రాంతంగా పేర్కొంటారు. 

ఎహువల శాంతములుడు నాగార్జునకొండపై హిందూ ఆలయాలు నిర్మించాడు. ఇక్కడ తొలి పరిశోధన లాంగ్​ హర్ట్స్​ జరిపారు. నాగార్జున కొండ లోయలో బౌద్ధ మహాచైత్యం, ఆరామాలు, విశ్వవిద్యాలయాలు, క్రీడారంగ స్థలం, యజ్ఞశాల బయటపడ్డాయి. ఇక్కడ బయటపడిన బౌద్ధ స్తూపాలు స్వస్తిక్​ గుర్తులు కలిగి ఉన్నాయి. శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండ వద్ద 150 గదులతో కూడిన పారావత విహారం లేదా మహా చైత్యం నిర్మించాడు. ఈ మహాచైత్యానికి ఆచార్య నాగార్జునుడు శిలా ప్రాకారాలను నిర్మించాడని హుయాన్​త్సాంగ్​ తన సియూకి గ్రంథంలో పేర్కొన్నాడు. నాగార్జునకొండ మహాయాన బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా, గొప్ప విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. అపరశైలులకు ప్రధాన కేంద్రంగా వర్ధిల్లింది. 

ఫణిగిరి

నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి గ్రామ ఉత్తర దిశలో నాగుపాము పడగను పోలిన కొండ ఉంది. ఈ కారణంగా ఆ గ్రామాన్ని ప్రాచీన కాలం నుంచి ఫణిగిరి అని పిలుస్తున్నారు. ఇక్కడ బౌద్ధ భిక్షుల నీటి అవసరాల కోసం రెండు చెరువులను తవ్వించారు. గౌతముడు తన రథసారథి చెన్నునితో కలిసి వెళ్తున్నప్పుడు కనిపించిన దృశ్యాలు, వాటి గురించి చెన్నుడు సిద్ధార్థుడికి సందేహాలు నివృత్తి చేస్తున్న విధానం ఎంతో సజీవంగా ఉన్న పాలరాతి శిల్పం ఇక్కడ బయటపడింది. ఇక్కడి ఒక శాసనంలో జంబు ద్వీప మూలవాయవ్యని పేర్కొని ఉంది. ఒకే శిలపై బుద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలు చెక్కి ఉన్నాయి. బుద్ధుడి పాదాలు, ధర్మచక్రం శిల్పాలు బయటపడ్డాయి. 

కోటిలింగాల 

కరీంనగర్ పట్టణానికి 50 కి.మీ.ల దూరంలోని వెల్లటూరు మండలంలో గోదావరి నదికి దక్షిణ దిశ వైపు గ్రామం కోటిలింగాల. శాతవాహన రాజు శ్రీముఖుని నాణేలు కోటిలింగాల వద్ద లభించాయి. ఈ నాణేలలో ఇతని పేరు చిముక అని పేర్కొన్నారు. ఇక్కడ దొరికిన ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మిలిపిలో నాగగోపికయ అని ఉంది. కోటిలింగాలకు 3 కి.మీ.ల దూరంలో హుస్సేన్ వాగు సమీపంలో పాసిగాం అనే గ్రామం ఉంది. దాని పక్కన ఉన్న పర్వతంపై రెండు కట్టడాల్లో ఒకటి స్తూప చైత్యం, మరొకటి చైత్యగృహం ఉన్నాయి .

నేలకొండపల్లి 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద బౌద్ధ స్తూపం ఉంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు తయారు చేసే శిల్పకళా క్షేత్రం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒక్కడ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలం నాటి నాణేలు లభించాయి. నేలకొండపల్లి బౌద్ధ సంఘారామంలో తొలుత హీనయానశాఖ ప్రారంభమై అనంతరం మహాయాన బౌద్ధశాఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. 

ధూళికట్ట

కరీంనగర్ జిల్లా కేంద్రం కరీంనగర్​ పట్టణానికి 30 కి.మీ.ల దూరంలోని ఎలిగేడు మండలంలో హుస్సేమియా వాగు ఒడ్డున ఉన్న గ్రామం ధూళికట్ట. తెలంగాణలోని అతి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ బార్హుత్​ శిల్పాల ప్రభావంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ స్తూప అవశేషాలతోపాటు రోమ్​ శాతవాహనుల కాలం నాటి నాణేలు లభించాయి. ఈ ప్రాంతంలో ఆ కాలంలో వర్తక వ్యాపారాలు గొప్పగా కొనసాగినట్లు తెలుస్తున్నది. 

1972–75 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్​ పురావస్తుశాఖ నిపుణులు, చరిత్రకారుడు వి.వి.కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరపగా శాతవాహనుల కాలం నాటి గొప్ప బౌద్ధ స్తూపం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నాగుపాము చుట్టపై బుద్ధుడు ఆశీనుడు కాగా, ఐదు పడగలు విప్పి రక్షణ ఇస్తున్న శిల్పం బయటపడింది. ఇక్కడి తవ్వకాల్లో పెద్ద మొత్తంలో మట్టి పాత్రలు, పెంకులు బయటపడ్డాయి. కాంస్యంతో చేసిన మాత కొంశిశువుల విగ్రహం లభించింది. 

కొండాపూర్​ 

సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్​ క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే పట్టణంగా విలసిల్లింది. శాతవాహనుల కంటే పూర్వమే అశిక (రంగారెడ్డి, హైదరాబాద్​, మెదక్​) రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ క్షేత్రంలో మట్టి, దంతంతో తయారు చేసిన అనేక రకాల పూసలు, విరిగిన గాజులు బయటపడ్డాయి. యక్షకుని ప్రతిమ, హారతి విగ్రహం, త్రిరత్న చిహ్నాలు లభించాయి. భారత పురావస్తు పర్యవేక్షణ శాఖ ఇక్కడ సైట్​ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలను ప్రదర్శనకు ఉంచారు.