సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్

సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
  • రూ.15 లక్షల వరకు నో ట్యాక్స్​.. వినియోగాన్ని పెంచేందుకే

న్యూఢిల్లీ : ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను భారాన్ని తొలగించాలని కేంద్రం భావిస్తున్నట్టు నేషనల్​ మీడియా గురువారం తెలిపింది. ఇలా చేయడం వల్ల వినియోగం పెరిగి ఎకానమీకి మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. పన్నును తొలగిస్తే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. కొత్త ట్యాక్స్​ సిస్టమ్​కు మారితేనే ఈ లాభాలు ఉంటాయని రాయిటర్స్​ వార్తాసంస్థ రిపోర్ట్​ చేసింది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు.

వచ్చే నెల ఒకటో తేదీన బడ్జెట్​ ప్రవేశపెట్టేలోపు తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక విధానంలో, వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటే, 5–-20 శాతం మధ్య పన్ను ఉంటుంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే 30 శాతం పన్ను కట్టాలి. కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 3 లక్షల వరకు ఆదాయానికి 0 శాతం పన్ను, ఆ తర్వాత రూ. 3–-7 లక్షల బ్రాకెట్‌‌పై 5 శాతం పన్ను, రూ. 7-–10 లక్షల బ్రాకెట్‌‌పై 10 శాతం, రూ. 10–-12 లక్షల బ్రాకెట్ వారికి 15 శాతం, రూ. 12-–15 లక్షల బ్రాకెట్‌‌కు 20 శాతం, రూ. 15 లక్షలు..అంతకంటే ఎక్కువ ఉంటే 30 శాతం పన్ను విధిస్తారు.

పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఈ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. మొదటి విధానాన్ని ఎంచుకుంటే ఇంటి అద్దె, బీమా వంటి ఖర్చులపై పన్ను రాయితీ ఇస్తారు. దీనివల్ల ట్యాక్స్​ పేయర్లకు కొంత డబ్బు ఆదా అవుతుంది. రెండోప్లాన్​ను 2020లో తీసుకొచ్చారు. ఈ విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఇంటి అద్దె వంటి మినహాయింపులు ఉండవు. అయినప్పటికీ తక్కువ పన్ను రేటు వల్ల ఎక్కువ మంది కొత్త విధానానికి మారుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. మనదేశంలో ఎక్కువ మంది ట్యాక్స్​పేయర్ల ఆదాయం రూ.10 లక్షల వరకు ఉంటోంది. ఈ బ్రాకెట్లోనే మెజారిటీ ట్యాక్స్​పేయర్లు ఉంటున్నారు. 

తగ్గుతున్న జీడీపీ..

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మనదేశ జీడీపీ గ్రోత్​ సెప్టెంబరు క్వార్టర్​లో ఏడు క్వార్టర్ల కనిష్టానికి పడిపోయింది. జీడీపీ పెరగాలంటే మధ్యతరగతి జనం మరింత ఖర్చు పెట్టేలా ప్రభుత్వం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో జనం ఎక్కువగా ఖర్చు పెట్టలేకపోతున్నారు. సబ్బులు, షాంపూలు, ఆటోమొబైల్స్​ వంటి వాటికీ గిరాకీ పడిపోతోంది.

పల్లెటూర్లతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమపై విధిస్తున్న అధిక పన్నులను తొలగించాలని మధ్యతరగతి కేంద్రాన్ని డిమాండ్​చేస్తోంది. ధరల పెరుగుదలకు తగ్గట్టు జీతాలు పెరగకపోవడంతో ఈ వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంటి బడ్జెట్లు తగ్గుతున్నాయని అంటున్నారు.