Budget 2024: బడ్జెట్ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు పథకాల గురించి మీకు తెలుసా..? 

Budget 2024: బడ్జెట్ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు పథకాల గురించి మీకు తెలుసా..? 

2024-25 బడ్జెట్ లో కేంద్రం ఉద్యోగ కల్పనకు పెద్ద పీట వేసింది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగ కల్పనను ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్లో ‘ప్రధాన మంత్రి ప్యాకేజీ’ కింద మూడు పథకాలను కేంద్రం అమలు చేయబోతోంది. స్కీమ్-ఏ, స్కీమ్-బి, స్కీమ్-సి.. ఇలా మూడు స్కీమ్స్ను కేంద్రం అమలు చేయనుంది. 

స్కీమ్-ఏ:
స్కీమ్-ఏలో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి మూడు విడతల్లో ఒక నెల వేతనం గరిష్టంగా రూ.15 వేల వరకూ కేంద్రం ఇవ్వనుంది. వేతన పరిమితి లక్ష రూపాయలు. 2 కోట్ల 10 లక్షల మంది యువత ఈ పథకంలో భాగంగా లబ్ది పొందుతారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

స్కీమ్-బి:
స్కీమ్-బిలో భాగంగా తయారీ రంగంలో ఉపాధి కల్పనను, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. తయారీ రంగంలో తొలిసారి పనిచేసే ఉద్యోగులకు, ఉద్యోగులకు ఉపాధి కల్పించిన సంస్థలకు కూడా ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ద్వారా ఈ ప్రోత్సాహకాలను కల్పించనుంది. నాలుగేళ్ల పాటు ఈ ప్రోత్సాహక ఫలితాలను లబ్దిదారులు పొందనున్నారు. ఈ స్కీం ద్వారా 30 లక్షల మంది యువతకు, ఆ యువతకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు ఈ ప్రోత్సహకాలు అందనున్నాయి.

స్కీమ్-సి:
అన్ని రంగాల్లో అదనపు ఉద్యోగాలను ప్రోత్సహించడమే ఈ స్కీమ్-సి ప్రధాన ఉద్దేశం. అదనపు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు నెలకు రూ.3 వేల వరకూ ఈపీఎఫ్వో కాంట్రిబ్యూషన్లో భాగంగా చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్లో భాగంగా 1.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పన చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.