రెండేండ్లలో కోటి మంది రైతులు

రెండేండ్లలో కోటి మంది రైతులు

 

  • సేంద్రీయ సాగు వైపు మళ్లించేందుకు కేంద్రం యత్నం 
  • సేద్యం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు 
  • నిరుటి కన్నా రూ. 27 వేల కోట్లు అధికం 
  • దేశ వ్యాప్తంగా కూరగాయల పంటల క్లస్టర్లు
  • ఈ ఖరీఫ్​లో 400 జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే..  
  • రైతులకు 109 కొత్త వంగడాలను అందిస్తామన్న ఆర్థిక మంత్రి 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్టు కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సుస్థిర విధానాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పంట దిగుబడుల పెరుగుదలకు తీసుకోనున్న నిర్ణయాలను ఆమె వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల ఆధారపడటాన్ని తగ్గించడం కోసం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను సాధించడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. ‘‘సేంద్రీయ వ్యవసాయంతో నేల సారంతోపాటు జీవ వైవిధ్యం పెరగడమే కాకుండా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గిపోతాయి. తద్వారా వారికి సేద్యంలో లాభాలు కూడా పెరుగుతాయి” అని కేంద్ర మంత్రి వివరించారు. 2024–25 బడ్జెట్ లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం మొత్తం రూ. 1,51,851 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్​లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తం రూ. 1.25 లక్షల కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్​లో కేటాయింపులు రూ. 27 వేల కోట్ల మేరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా కూరగాయల సాగును కూడా ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లను ప్రమోట్ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కూరగాయల దిగుబడులు పెరిగి, స్థిరంగా సప్లయ్ కొనసాగేలా చూసేందుకుగాను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

రైతులకు 109 కొత్త వంగడాలు.. 

ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని నిలబడే వంగడాల అభివృద్ధి కోసం వ్యవసాయ పరిశోధనలు చేపట్టే అంశంపైనా దృష్టి సారించనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ‘‘వాతావరణ మార్పులను తట్టుకుని, అధిక దిగుబడులను ఇచ్చేలా 32 పంటలకు సంబంధించి కొత్తగా అభివృద్ధి చేసిన 109 వంగడాలను రైతులకు విడుదల చేస్తాం. అవసరాన్ని బట్టి 10 వేల వరకూ బయో ఇన్ పుట్ సెంటర్లను స్థాపిస్తాం. నూనె గింజల ఉత్పత్తిని పెంచడంతోపాటు నిల్వ, మార్కెటింగ్ సౌలతులపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం” అని ఆమె ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటును ప్రోత్సహిస్తామన్నారు. ఈ డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ద్వారా.. వాతావరణ సూచనలు, పంటల సాగుకు సంబంధించిన సలహాలు, మార్కెట్ ధరల వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో డిజిటల్ పద్ధతిలో పంటల సర్వేను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. జన్ సమర్థ్ పోర్టల్​కు అనుసంధానం చేసిన కిసాన్ క్రెడిట్ కార్డులను మొదటి దశలో ఐదు రాష్ట్రాల్లోని రైతులకు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నాబార్డ్ ద్వారా రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతులకు రుణ సదుపాయాలనూ కల్పిస్తామన్నారు.   

సేద్యానికి ఊతం 
కేంద్ర బడ్జెట్​లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఊతం లభించేలా కేటాయింపులు జరిగాయి. దృఢమైన, స్వయం సమృద్ధ భారత్ దిశగా మార్గం సుగమం అయింది. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ ను ప్రవేశపెట్టింది. రైతుల ఆదాయం పెంచేందుకు చేపట్టే చర్యలతో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ కూర్పు జరిగింది. ఇది రైతులు, మహిళలు, యువత, ఆర్థికంగా వెనకబడిన వర్గాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఉంది. 
- శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 

రైతులకు మొండిచేయి 
కేంద్ర బడ్జెట్​లో రైతులకు మొండిచేయి చూపించారు. ఎంఎస్​పీకి చట్టబద్ధత, పంట రుణాల మాఫీ డిమాండ్లపై కేంద్రం మౌనం పాటించింది. దేశంలోని మెజార్టీ జనాభాపై ప్రభావం చూపే వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో 3.15% మాత్రమే నిధులు కేటాయించింది. 2020–21తో పోలిస్తే.. ఈసారి 5.44% కోత పెట్టింది. సకాలంలో వర్షాలు పడక వ్యవసాయ వృద్ధి రేటు 1.4 శాతానికి పడిపోయిన ఏడాది తర్వాత.. ఇప్పుడు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఎంఎస్​పీ ధరలను పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి ఇదివరకు చెప్పారు.. కానీ అవి ఇప్పటికీ స్వామినాథన్ కమిషన్ ఫార్ములా కంటే దిగువనే ఉన్నాయి. 
-  జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ