రైల్వేశాఖ గుడ్ న్యూస్ : సీనియర్ సిటిజన్లకు మళ్లీ టికెట్ రాయితీ..?

రైల్వేశాఖ గుడ్ న్యూస్ : సీనియర్ సిటిజన్లకు మళ్లీ టికెట్ రాయితీ..?

దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న మోడీ 3.0 ప్రభుత్వం మొదటి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే బడ్జెట్ పై వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పన్ను చెల్లింపుదారులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైలు టిక్కెట్లపై గతంలో తమకు అందుబాటులో ఉన్న రాయితీలు పునరుద్ధరిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి బడ్జెట్‌ సమావేశానికి ముందు ఈ అంశం తెర మీదకు వస్తోంది. కోవిడ్ కు ముందు  సీనియర్ సిటిజన్లు రైలు టిక్కెట్లపై రాయితీ పొందేవారు. కోవిడ్ మహమ్మారి వచ్చాక సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీ రద్దు చేశారు. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత 2020 మార్చి 20న రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్‌ల రైలు ఛార్జీల్లో రాయితీలను రద్దు చేసింది. అంతకుముందు దేశంలోని పురుష సీనియర్ సిటిజన్లు, మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై భారీ రాయితీకి లభించేది. మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50 శాతం రాయితీ లభించగా.. పురుషులు, ట్రాన్స్‌జెండర్ సీనియర్ సిటిజన్లకు 40 శాతం రాయితీ ఉండేది. రాజధాని, శతాబ్ది సేవలతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, మెయిన్ రైళ్లకు కూడా ఈ తగ్గింపు వర్తించేది. 

కాగా రాయితీ రద్దయినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణాలకు ఇతర ప్రయాణికులతో సమానంగా పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.  రైల్వే శాఖ నిబంధనల ప్రకారం పురుషులు, లింగమార్పిడి వ్యక్తులకు 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, మహిళలకు 58 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సీనియర్ సిటిజన్లుగా అర్హులు.


రాయితీని ఉపసంహరించుకున్న తర్వాత భారతీయ రైల్వేలకు వచ్చిన ఆదాయం ఎంతంటే:

రైలు టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని నిలిపివేయడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను ఆర్జించింది.  ఒక రిపోర్ట్ ప్రకారం..  ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 మధ్య రైల్వే శాఖలో సుమారు 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు రాయితీ కోల్పోగా దాని ద్వారా రైల్వే శాఖ అదనంగా రూ.5,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో సబ్సిడీ ముగిసే సమయానికి రూ.2,242 కోట్లు అదనంగా వచ్చాయి. ఐతే గతంలోనే సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రశ్నలు పార్లమెంటు ఉభయ సభలతో సహా వివిధ వేదికలపై ప్రతిపక్షాలు లేవనెత్తగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చాలాసార్లు సమాధానం దాటవేశారు. పైగా ప్రయాణికుల గమ్యస్థానానికి బహిరంగ మార్కెట్ లో  టిక్కెట్ ధర రూ. 100 అయితే రైల్వే కేవలం రూ. 45 మాత్రమే రైల్వే శాఖ వసూలు చేస్తోందని.. దాన్ని బట్టి చూస్తే ప్రతి రైలు ప్రయాణీకుడికి రైల్వే ఛార్జీలపై 55 శాతం రాయితీని లభిస్తోందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.