
- బడ్జెట్లో రూ.26,889 కోట్లు కేటాయింపు
- గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు
- సాక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 స్కీమ్స్‌కు రూ.21,960 కోట్లు
న్యూఢిల్లీ: మహిళా, శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నిధులను పెంచింది. పోయిన బడ్జెట్ లో రూ.23,182.98 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.26,889.69 కోట్లు కేటాయించింది. ఇందులో అత్యధికంగా రూ.21,960 కోట్లను సాక్షమ్ అంగన్ వాడీ, పోషణ్ 2.0 స్కీమ్స్ కు కేటాయించింది. చిన్నారులు, బాలికల్లో పోషకారహార లోపాన్ని అధిగమించేందుకు.. గర్భిణులు, పాలిచ్చే తల్లులుకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్రం ఈ పథకాలను అమలు చేస్తున్నది. వీటి ద్వారా 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 20 లక్షల మంది బాలికలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అమలు కోసం ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,615.38 కోట్లు, మిగతా రాష్ట్రాలకు రూ.22,195.95 కోట్ల గ్రాంట్స్, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.897.40 కోట్ల గ్రాంట్స్ ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్ లో చూపించింది.
ఇవీ కేటాయింపులు..
- ఆదివాసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కు రూ.120 కోట్లు, ధర్తి అబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కు రూ.75 కోట్లు.
- చిన్నారుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్యకు రూ.1,500 కోట్లు.
- బేటీ బచావో బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్స్, నారీ అదాలత్స్, మహిళా పోలీస్ వలంటీర్స్ లాంటి కార్యక్రమాలతో కూడిన ‘సంబాల్’ స్కీమ్ కు రూ.629 కోట్లు.
- స్వధార్ గృహాలు, వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన లాంటి కార్యక్రమాలతో కూడిన ‘సామర్థ్య’ స్కీమ్ కు రూ.2,521 కోట్లు.
- నిర్భయ ఫండ్ కింద రూ.30 కోట్లు.
- నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (ఎన్సీడబ్ల్యూ)కు రూ.28 కోట్లు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు రూ.25 కోట్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ (ఎన్ఐపీసీసీడీ)కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(సీఏఆర్ఏ)కి రూ.14.49 కోట్లు.