2026లో జీడీపీ గ్రోత్​ 6.3 నుంచి 6.8శాతం.. ఈ గ్రోత్​ రేట్​ సరిపోదు

2026లో జీడీపీ గ్రోత్​ 6.3 నుంచి 6.8శాతం.. ఈ గ్రోత్​ రేట్​ సరిపోదు
  • గ్రోత్​ రేటు పెరగాలి.. ధనిక దేశంగా ఎదగడానికి 8%  కావాలి
  • వృద్ధి​ పెరగాలంటే భూ, కార్మిక సంస్కరణలు అవసరం
  • కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్​
  • అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి
  • వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు
  • సంపద సృష్టిలో స్టాక్​ మార్కెట్లు కీలకంగా మారాయి
  • ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్​ను సడలించాలి
  • ఎకనమిక్​ సర్వే సూచన

న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ గ్రోత్​ 6.3-–6.8 శాతమే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధనికదేశంగా ఎదగడానికి ఈ గ్రోత్​ రేట్​సరిపోదని, రూల్స్​ను మరింత ఈజీ చేయాలని అభిప్రాయపడింది. దీని ప్రకారం.. గ్రోత్​ పెరగాలంటే భూ, కార్మిక సంస్కరణలు అవసరం. 2047 నాటికి వికసిత్​ భారత్​ను సాధించాలంటే ఎనిమిది శాతం గ్రోత్ ​కావాలి. ఇది సాధించాలంటే పెద్ద ఎత్తున సంస్కరణలు తేవాలి. అప్పులు తగ్గి ఆస్తులు పెరగాలి. ప్రైవేట్​కన్సంప్షన్​ , ఎఫ్​డీఐలు కూడా పెరగాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్​ను కేంద్రం 6.4 శాతంగా అంచనా వేసింది. కరోనా తరువాత గ్రోత్​ ఇంత తక్కువగా రావడం ఇదే మొదటిసారి. రాబోయే పదేళ్లు లేదా 20 ఏళ్ల పాటు జీడీపీ గ్రోత్​ రేటు ఏడాదికి ఎనిమిది శాతం రావాలి. జీడీపీలో ఇన్వెస్ట్​మెంట్ ​రేట్​ 35 శాతానికి (ప్రస్తుతం 31 శాతం) పెరిగితే 2047 నాటికి మనది ధనికదేశం అవుతుంది. 2028 నాటికి ఇండియా ఐదు ట్రిలియన్​ డాలర్ల, 2030 నాటికి 6.3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది.  ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్​ను, నియంత్రణలను మరింత సడలించాలి. కరెంటు వంటి వాటి చార్జీలను తగ్గించాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రైతులకి సహాయం చేయాలి. దీనివలన ఆహార ఉత్పత్తి పెరుగుతుంది.   

చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి..

చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల జర్మనీ, స్విట్జర్లాండ్​, సింగపూర్​ విజయాలు సాధించాయి. ఉన్న పరిశ్రమలకూ ప్రోత్సాహం అందించాలి. ఫలితంగా మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ఎక్కువ రూల్స్​పెట్టడం వల్ల ఇన్నోవేషన్లు,  పోటీ తగ్గుతాయి. 

ధరలపై బెంగ వద్దు

కూరగాయల ధరలు అదుపులోకి వచ్చాయి. జనవరి–మార్చి క్వార్టర్​లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇది ఆర్​బీఐ లక్ష్యమైన నాలుగు శాతానికి చేరుకోవచ్చు.  ప్రతికూల వాతావరణం, అంతర్జాతీయ వస్తువుల ధరల పెరుగుదల వల్ల సమస్యలు రావొచ్చు.  ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది. ప్రపంచ వృద్ధి కొంచెం తక్కువగా ఉండొచ్చు.  మానుఫ్యాక్చరింగ్​ సెక్టార్లో ఇబ్బందులు ఉన్నా, సేవల రంగం దూసుకెళ్తోంది. 
 
మన ఆర్థిక వ్యవస్థ గుడ్​​

విదేశాల్లో యుద్ధాల వంటి సమస్యలు ఉన్నప్పటికీ మనదేశ ఆర్థికరంగం బలంగా ఉంది. బ్యాంకుల ​లాభాలు పెరిగాయి. సంపద సృష్టిలో స్టాక్​మార్కెట్లు కీలకంగా మారాయి.  గత ఏడాది ఐపీఓలు భారీగా వచ్చాయి.  మార్కెట్‌‌లో యువ పెట్టుబడిదారుల భాగస్వామ్యం కూడా పెరిగింది. 


సర్వే హైలైట్స్​..

1)  స్మార్ట్‌‌  సిటీ మిషన్ కింద గత పదేళ్లలో 
రూ.1.5 లక్షల కోట్ల విలువైన 7,500 ప్రాజెక్ట్‌‌లు పూర్తయ్యాయి.  స్మార్ట్‌‌ సిటీలను డెవలప్‌‌ చేసేందుకు 2015 లో ఈ మిషన్‌‌ను కేంద్రం లాంచ్ చేసింది.

2) ఈ–కామర్స్ కంపెనీల ద్వారా దేశ ఎగుమతులను పెంచేందుకు అడ్డుగా ఉన్న రూల్స్ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.

3) ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఏడాదికి 7–8 శాతం వృద్ధి చెందాలంటే దివాలా పక్రియను మరింత మెరుగుపరచాలి. ఇన్‌‌సాల్వెన్సీ బ్యాంకరప్టసీ కోడ్‌‌ (ఐబీసీ) కింద దివాలా పనులు వేగంగా జరగాలి. 

4)  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) లేబలింగ్‌‌ రూల్స్‌‌ను కఠినం చేయాలి. అల్ట్రా ప్రాసెస్డ్‌‌ ఫుడ్స్‌‌ (యూపీఎఫ్‌‌ఎస్‌‌) వాడకాన్ని తగ్గించేందుకు జీఎస్‌‌టీ ఎక్కువ వేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి.

5) 2‌‌‌‌024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పెట్టుకున్న ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్‌‌– ఖర్చులు, ఆదాయం మధ్య తేడా) టార్గెట్‌‌లో  కిందటేడాది డిసెంబర్‌‌‌‌ 31 నాటికి 56.7 శాతాన్ని చేరుకున్నాం. ఏప్రిల్‌‌–డిసెంబర్‌‌‌‌లో ద్రవ్య లోటు రూ.9,14,089 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్ల లోపు ఉంచాలని ప్రభుత్వం చూస్తోంది. 

6) ఈ ఏడాది బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. వెండి ధరలు మాత్రం పెరగొచ్చు. వరల్డ్‌‌ బ్యాంక్ అంచనాల ప్రకారం, 2025 లో బంగారం ధరలు 5.1 శాతం మేర, 2026 లో 1.7 శాతం మేర పడతాయి. 

7) చాలా జిల్లాల్లో 5జీ సర్వీస్‌‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో  డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడింది. భారత్‌‌ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రాడ్‌‌బ్యాండ్ సర్వీస్‌‌లు విస్తరించాయి. 

8) స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది మార్కెట్ పడొచ్చు.  ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. యూఎస్ మార్కెట్‌‌లు పడితే ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా ఉంటుంది. 

9) 2023–24 లోని ఏప్రిల్‌‌– నవంబర్‌‌‌‌ మధ్య ఇండియాలోకి 47.2 బిలియన్‌‌ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ (ఎఫ్‌‌డీఐలు) రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌లో 55.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. 17.9 శాతం వృద్ధి నమోదైంది.

10) 2019–20 నుంచి 2023–24 మధ్య ప్రభుత్వ మూలధన ఖర్చులు (క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌) 38.8 శాతం పెరిగాయి. కిందటేడాది  లోక్‌‌సభ ఎన్నికల  తర్వాత అంటే జులై–నవంబర్ మధ్య ప్రభుత్వ  మూలధన ఖర్చులు పుంజుకున్నాయి.

వారానికి 55–60 గంటలు మించిన పని మంచిది కాదు 

వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలనే వాదనలు నడుస్తున్న టైమ్‌‌లో 60 గంటల కంటే ఎక్కువ పనిచేయడం మంచిది కాదని ఎకనామిక్‌ సర్వే పేర్కొంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. రోజుకి 12 గంటలకు పైగా డెస్క్ దగ్గర  పనిచేస్తే ఉద్యోగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంది. ‘ఎన్ని గంటలు పనిచేశారనే దానిని బట్టి ఉత్పాదకతను లెక్కించొచ్చు.అయినప్పటికీ డబ్ల్యూహెచ్‌‌ఓ సర్వే ప్రకారం వారానికి 55–60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయని తెలిసింది.  వర్క్–లైఫ్​ బ్యాలెన్స్​ ముఖ్యం’ అని పేర్కొంది.

- అనంత నాగేశ్వరన్​, చీఫ్ ​ఎకనమిక్​ అడ్వైజర్​

2023-–24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం జీడీపీ గ్రోత్​ కనిపించింది. సాగు దిగుబడులు, రూరల్ ​డిమాండ్​ పెరిగి ధరలు తగ్గితే ఈసారి కూడా జీడీపీ గ్రోత్​ బాగుంటుంది.  ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. యుద్ధాలు వంటి జియోపొలిటికల్​ టెన్షన్లు, వాణిజ్యపరమైన గొడవలు, కమోడిటీల ధరలు పెరుగుదల మన ఎకానమీకి అడ్డంకులుగా మారొచ్చు