2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేనప్పటికీ, ఉద్యోగాలు చేస్తూ అరకొర సంపాదించే వారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి కళ్లన్నీ దీని పైనే ఉంటాయి. అందుకు కారణం.. పన్ను. ఈ నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పులు, రిబేట్లు, తగ్గింపుల కోసం వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రూ.10 లక్షల వరకు No Tax..!
ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలు కలిపితే రూ.7లక్షల 75వేలు అవుతుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 10 లక్షల వరకు పెంచవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం రూ.15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తుండగా.. కొత్తగా రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం పన్ను స్లాబ్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ | భారీగా పెరిగిన నియామకాలు.. డిసెంబర్‌లో 31 శాతం వృద్ధి: ఫౌండిట్
ప్రభుత్వం ఈ రెండు ఎంపికలను పరిశీలిస్తున్నట్లు నివేదికలు బయట పెడుతున్నాయి. వార్షిక ఆదాయాన్ని రూ. 10 లక్షల వరకు పన్ను లేకుండా చేయడం లేదా రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి కొత్త 25 శాతం పన్ను శ్రేణిని ప్రవేశపెట్టడం. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ఆదాయ నష్టం వాటిల్లవచ్చని తెలుస్తోంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.