చేయూతకు రూ.14,861 కోట్లు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మందికి పింఛన్లు

చేయూతకు రూ.14,861 కోట్లు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మందికి పింఛన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేయూత పింఛన్లకు రూ.14,861  కోట్లు ప్రకటించింది.  గత బడ్జెట్లో రూ.14,628 కోట్లు కేటాయించగా..ఈసారి రూ.233 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.67 లక్షల మందికి పింఛన్ అందుతున్నది. వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ రోగులు, బోదకాలు బాధితులు, కళాకారులు ఇలా 11 కేటగిర్లీలో పింఛన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుండగా మిగిలిన వారికి రూ. 2,016 అందిస్తున్నారు. 2024–25 ఏడాదిలో42.67 లక్షల మందికి రూ.14,628 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం.. ఇందులో ప్రతి నెలా రూ.1000.47 కోట్లు పింఛన్ దారులకు చెల్లిస్తున్నది.

పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణికంగా 22.72 లక్షల మందికి (53%) బ్యాంకుల ద్వారా 19.95 లక్షలు (47%) పంపిణీ జరుగుతున్నది. వృద్ధాప్య పింఛన్లు 15.25 లక్షల మంది, వితంతువులు 15.26 లక్షలు, దివ్యాంగులు 4.92 లక్షలు, గీత కార్మికులు 63 వేలు, చేనేత 36 వేలు, హెచ్ఐవీ బాధితులు 35 వేలు, డయాలసిస్ రోగులు 4 వేలు, ఫైలేరియా రోగులు 18 వేలు, బీడీ కార్మికులు 4.23 లక్షలు, ఒంటరి మహిళలు 1.41 లక్షలు, బీడీ టేకేదార్లు 4 వేల మంది పెన్షన్ పొందుతున్నారు.

సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఎస్సీలు 6.76 లక్షల మంది, ఎస్టీలు 3.47 లక్షల మంది, బీసీలు 23.39 లక్షల మందికి, మైనార్టీలు 2.84 లక్షల మంది, ఓసీలు 6.21 లక్షల మంది లబ్ధిదారులు కవర్ అవుతున్నారు. మహిళా లబ్ధిదారులు 28.05 లక్షల మంది పింఛన్ పొందున్నారు. అంటే 66 శాతం మహిళా లబ్ధిదారులు కవర్  అవుతున్నారు. కాగా, కొత్తగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చాయని తెలిసింది. వీరికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందా..? పాతవారికి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచుతుందా..? అనేదానిపై క్లారిటీ లేదు.