వ్యవసాయ భూమి విస్తరిస్తున్నది. 2014 - 15లో స్థూల సాగు భూమి 62.48 లక్షల ఎకరాల నుంచి 2021–22 నాటికి 135 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ఎట్లా సాధ్యమయ్యింది అని ప్రభుత్వం చెప్పటం లేదు. ఇంత భూమి కొత్తగా సాగులోకి ఎట్లా వచ్చింది? భూమి వినియోగంలో మార్పు జరిగిందా? ఈ లెక్కల మీద ఉండే అనుమానాలు, లోటుపాట్ల గురించి కాకుండా, ఇటువంటి వ్యవసాయ అభివృద్ధికి తగిన ఆర్థిక వనరులు ప్రభుత్వం నుంచి వచ్చినాయా అనే ప్రశ్న మన ముందు ఉంది.
సాగు పెరిగినా కేటాయింపులు లేవు
సాగు భూమి 117శాతం పెరిగిందని ప్రభుత్వం అంటున్నది. అటువంటి విస్తీర్ణానికి కావాల్సిన నిధు లు మాత్రం ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. ఎకరాకు రూ.50 వేలకు 2014–15లో మొత్తం రూ.31,240 కోట్ల పెట్టుబడి అయితే, 2021-–22 నాటికి అదే ఎకరా రూ.50 వేల పెట్టుబడికి రూ.67,500 కోట్ల పెట్టుబడి అయింది. సామాన్య రైతులే భూమి, ఆస్తులు తాకట్టు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టిండ్రు. పంటలు, పాడి పశువులు, గొర్రెలు, చేపలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2014–15లో రూ.76,123 కోట్లు ఉంటే, 2022–-23 నాటికి రూ.2,17,877 కోట్లకు పెరిగింది అని ప్రభుత్వ నివేదికలో ఉన్నది. పెట్టుబడులు పోను, 2014–15లో రూ.44,883 కోట్ల నుంచి 2021–22 నాటికి రూ.1,50,377 మిగులు వస్తే, ఈ సంపద ఎక్కడకు పోయింది? ఈ ఉత్పత్తులలో కేవలం పంటల విలువ 2014 –15లో రూ.41,706 కోట్ల నుంచి 2022–23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.98,478 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల ఎక్కువగా లేదు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపులో గొర్రెల పథకం ద్వారా మాత్రమే సాధ్యం అయినట్టు ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తున్నది. అయినా, మాంసం ధర తగ్గకపోవడం చూస్తే, ఈ లెక్కల శాస్త్రీయత మీద అనుమానం వస్తున్నది.
రైతుల పరిస్థితి మెరుగైతే.. అప్పులెందుకు మిగిలినయి?
పంటల విలువ ప్రకారం రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగు ఆయిత లేదు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగు అయి ఉంటే రైతుల నెత్తిమీద అప్పులు ఎందుకు మిగిలినయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ఇంత వ్యవసాయ వృద్ధి అయినట్టయితే రుణ మాఫీ, రైతు బంధు పథకాల అవసరం ఎందుకు ఏర్పడింది? అయితే ఈ వృద్ధి లెక్కలు తప్పు. లేదా వృద్ధిలో రైతు మినహా లాభాలు ఎవరికో దక్కినయి. ఏ విధంగా చూసినా ఇటువంటి వ్యవసాయ వృద్ధిని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బడ్జెట్లో వ్యవసాయానికి 7శాతమా?
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతి ఏడాది పెరిగింది. 2014-–15లో రూ.1 లక్ష కోట్లు బడ్జెట్ ఉంటే, అందులో వ్యవసాయానికి ఇచ్చింది 7.06 శాతం మాత్రమే. 2023-–24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షలకు పెరిగినా, వ్యవసాయానికి కేటాయింపు అందులో 7.20 శాతం మాత్రమే. వ్యవసాయానికి తెలంగాణ బడ్జెట్లో ప్రాధాన్యత 7 శాతం మించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తుల విలువలో 18.24 శాతం ఉన్న వ్యవసాయ రంగానికి ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువ.
ఉత్పత్తిలో ప్రభుత్వ పెట్టుబడి లేదు
వ్యవసాయ శాఖకు రాబోయే సంవత్సరం 2023-–24 కి ఇచ్చినది రూ.20,890.26 కోట్లు. ప్రస్తుత సంవత్సరానికి ఇచ్చింది రూ. 18,941.71 కోట్లు. పెరుగుదల 9.33 శాతం మాత్రమే. ఇందులో వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు, మార్కెటింగ్ అభివృద్ధి, సహకార, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి శాఖల పద్దులు కలిపి ఉంటాయి. ఎన్నికల సంవత్సరంలో గణనీయంగా పెరిగిన వ్యవసాయ బడ్జెట్ ఆ తరువాత ఏడాది పెరుగుదల అంతగా లేదు. 2015-–16లో అంతకు ముందు సంవత్సరం కంటే తక్కువ ఇచ్చారు. 2017-–18లో కూడా అంతకు ముందు ఏడాది కంటే తక్కువ కేటాయించింది ప్రభుత్వం. కాగా, 2018–-19లో 54 శాతం పెంచింది. తరువాత సంవత్సరం 19 శాతం మాత్రమే పెంచింది. 2020-–21లో 15 శాతం పెంచింది. ప్రతి ఏడాది వ్యవసాయ ఉత్పత్తి విలువ పెరుగుతుంటే ప్రభుత్వ కేటాయింపులు ఆ మేరకు పెరగలేదు. ఆ విధంగా పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తిలో ప్రభుత్వ పెట్టుబడి లేదు.
రైతుకు ఉపశమనం సున్నా
వ్యవసాయ రంగానికి కేటాయింపు పెరిగినా, అందులో కేవలం ఒక్క పథకానికే రూ.15,075.00 కోట్లు ఇచ్చారు. అచ్చంగా వ్యవసాయ శాఖ బడ్జెట్లో, మూడు అంకెలు దాటిన కేటాయింపులు కేవలం 4 పథకాలే. మొత్తం వ్యవసాయ శాఖకు ప్రతిపాదించిన బడ్జెట్లో 91 శాతం 4 పథకాలకు మాత్రమే. అవి రైతు బంధు, రైతు బీమా, కరెంటు సబ్సిడీ, రుణ మాఫీ. మిగతా పథకాలకు ఇచ్చింది రూ.3 వేల కోట్లు మించదు. వ్యవసాయ రంగం అభివృద్ధికి కావాల్సిన సమతుల్య ఆలోచన తెలంగాణ ప్రభుత్వంలో కొరవడింది అనడానికి ఇది ఒక నిదర్శనం. వ్యవసాయ అభివృద్ధి మీద నిలకడతో కూడిన సమగ్ర ఆలోచన ప్రభుత్వం వద్ద లేకపోవడంతో నిధులు ఉన్నా రైతులకు వస్తున్న ఉపశమనం సున్నా.
రుణమాఫీపై బహిరంగ ప్రకటన లేదు
2021–-22 బడ్జెట్లో రుణ మాఫీకి ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రతిపాదించింది రూ.5,225 కోట్లు. 2023-–24 లో రూ.6,385 కోట్లకు పెంచింది. అప్పుడింత ఇప్పుడింత ఇచ్చే నిధుల వల్ల రుణ భారం రైతుల మీద తగ్గలేదు. రుణ మాఫీ వస్తదనుకొని రుణాల చెల్లింపులలో రైతులు జాప్యం చేయడం వల్ల రుణాల పైన వడ్డీ భారం విపరీతంగా పెరుగుతున్నది. రైతులు రుణాల ఊబిలోకి ఇంకా కూరుకుపోతున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ పథకానికి కేటాయింపుల వెనుక పారదర్శక విధానం లేదు. మొత్తం రుణ మాఫీ అంచనా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించకపోవటం, దానికి సంబంధించిన ప్రణాళిక పత్రం విడుదల చేయకపోవటం వల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. జూటా మాటల వల్ల ఇంకా నష్టపోతున్నారు. రైతుల రుణ మాఫీ అంచనాలు శాస్త్రీయంగా లేవు. ఎవరికి రుణ మాఫీ అందింది? అసలు ఏ ఒక్క రైతుకూడా రుణ విముక్తుడు అయినట్లు రుజువులు కూడా లేవు. ప్రైవేటు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి.
వ్యవసాయ పథకాల కుదింపు
వ్యవసాయ కేటాయింపులలో హెచ్చు తగ్గులు స్పష్టంగా కనపడుతున్నది. పథకాల కుదింపు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం దృష్టిలో ఒకే ఒక పథకం కింద సహాయం చేస్తే తెలంగాణ వ్యవసాయం గట్టు ఎక్కుతుందని భావిస్తున్నట్టుగా ఉంది. గడిచిన 10 సంవత్సరాల నిధుల కేటాయింపులు తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడలేదు. పంట దిగుబడి పెరగడానికి, వ్యవసాయ విస్తీర్ణం పెరగడానికి ప్రకృతి నుంచి అందిన సహకారమే చాలా ఎక్కువ. అటువంటి ప్రకృతి వనరుల మీద పెట్టుబడులు లేవు.
వ్యవసాయంపై అన్ని పార్టీలూ స్పష్టత ఇవ్వాలి
పథకాలకు కేటాయింపులు, రైతు పెట్టుబడి సహాయ పథకం మినహాయిస్తే ఐదు సంవత్సరాల నుంచి ఉన్న పథకాలను తగ్గించారు. కొన్ని పథకాలకు భారీగా కేటాయించి, ఇతర పథకాలకు తగ్గించడం ప్రభుత్వ నీతిలో భాగంగా కనిపిస్తున్నది. అనేక సమస్యలున్న రైతుకు ఊరట కలిగించడానికి కూడా ఇవి సరిపోవు. ప్రభుత్వం ఈ కొసరు నిధులతో తెలంగాణ వ్యవసాయాన్ని ఏ దిశగా అభివృద్ధి చేసిందో అర్థమవుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటిదాకా వ్యవసాయానికి దిశ లేకుండాచేసింది. అధికారంలోకి వస్తే మళ్లీ అదేవిధంగా చేయబోతుందా? ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే అవి కూడా అదేవిధంగా వ్యవసాయానికి దిశ లేకుండా చేస్తాయా? ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ వ్యవసాయ కేటాయింపులు, అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అసలు పథకాలు మాయం
ప్రస్తుత సంవత్సరం బడ్జెట్లో మార్కెట్ నిధి, యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం 3 పథకాలకు తగ్గించింది. వాటిని ఎందుకు తగ్గించారో ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఇవి అవసరం అని భావించిన ప్రభుత్వం.. వాటికి నిధులు తగ్గించడంలో ఉన్న మతలబు ఏమిటి? ఆ విషయం స్పష్టం చేస్తేనే రైతులకు తెలిసేది. తగ్గించడం, పెంచడం, ఖర్చు చేయకపోవడం వంటి చర్యల వల్ల ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ అవుతుంది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అవసరమైన కేటాయింపులు చేస్తూ, నిలకడగా అమలు చేయాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులు జరిపితేనే ఫలితం వచ్చినట్టు భావిస్తున్నది.
- డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్