
- ట్యాక్స్ భారం తగ్గించడంతో పెరిగిన ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు
- మెరిసిన ఫుట్‌వేర్, లెదర్ కంపెనీలు
- చతికిలపడ్డ రైల్వే, పవర్, ఆయిల్ మార్కెటింగ్ షేర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: వినియోగం పెంచడంపై తాజా బడ్జెట్ ఫోకస్ పెట్టడంతో కొన్ని సెక్టార్ల షేర్లు రానున్న సెషన్లలో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కన్జూమర్లకు డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌లు అమ్ముతున్న కంపెనీలు తమ సేల్స్ పెరగొచ్చని భావిస్తున్నాయి. బడ్జెట్‌తో ఏయే సెక్టార్లు లాభపడతాయో ఈ కింద చూడొచ్చు..
వినియోగం
రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ వేయకపోవడంతో ట్యాక్స్‌పేయర్ల దగ్గర మరింతగా డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పుంజుకుంటుంది. సబ్బులు, షాంపూలు అమ్మే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఎక్కువగా లాభపడనున్నాయి. అంతేకాకుండా ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వంటివి అమ్మే కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీల షేర్లు కూడా పెరగొచ్చు. క్లాత్స్, కార్ల కంపెనీలు కూడా బడ్జెట్‌తో లాభపడే అవకాశం ఉంది.
నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ శనివారం 3 శాతం ర్యాలీ చేయగా, ట్రెంట్, డీమార్ట్, జొమాటో, రాడికో, గోద్రెజ్ జేసీపీ, ఐటీసీ హోటల్స్, యూనిటైడ్ స్పిరిట్ షేర్లు 5–10 శాతం వరకు లాభపడ్డాయి. వరుణ్ బెవరేజెస్, యూనైటెడ్ బెవరేజెస్, టాటా కన్జూమర్స్, ఐటీసీ, కోల్‌గేట్, మారికో, బ్రిటానియా, హిందుస్తాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు కూడా 2 శాతం నుంచి 4 శాతం వరకు పెరిగాయి.
ప్రజల దగ్గర డబ్బులు పెరిగితే బండ్ల సేల్స్ పెరుగుతాయనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా మారుతి, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్ షేర్లు శనివారం ర్యాలీ చేశాయి. ఇండ్ల సేల్స్ కూడా పెరుగుతాయనే అంచనాలతో రియల్టీ షేర్లు కూడా లాభపడ్డాయి. ఫీనిక్స్ లిమిటెడ్, ప్రెస్టీజ్, లోధా, శోభ, డీఎల్‌ఎఫ్, ఓబ్రాయ్ రియల్టీ వంటి కంపెనీల షేర్లు 3–4 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 3 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఎఫ్‌డీఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్) లిమిట్‌ను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్‌ఐసీ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు శనివారం 4 శాతం వరకు పెరిగాయి. కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలను మినహాయింపుగా వాడుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో చాలా వరకు లాభాలను కోల్పోయాయి. ఎఫ్‌డీఐ లిమిట్ పెరడంతో ఈ సెక్టార్‌లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
అగ్రికల్చర్
1.7 కోట్ల రైతులు ఈజీగా లోన్లు పొందడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా పప్పుల దిగుమతులను తగ్గించుకునేందుకు ఆరేళ్ల మిషన్‌ను ప్రకటించింది. వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా దిగుబడి బాగుండేలా చేయడానికి 100 రకాల విత్తనాలను డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం నేషనల్ మిషన్‌ను ప్రకటించింది. అలానే చేపలు, రొయ్యలు వంటి ఆక్వా ప్రొడక్ట్‌ల ఎగుమతులను పెంచడంపై ఫోకస్ పెట్టింది. బడ్జెట్‌లో అగ్రికల్చర్ సెక్టార్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో కావేరి సీడ్స్, అవంతి ఫీడ్స్, గోద్రెజ్ ఆగ్రోవెట్ వంటి కంపెనీల షేర్లు శనివారం 5 శాతానికి పైగా లాభపడ్డాయి.
ఫుట్‌వేర్
ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్‌పై బడ్జెట్‌లో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సెక్టార్‌లోకి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 22 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని, రూ.1.1 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను అందుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ సెక్టార్‌లోని కంపెనీల షేర్లు శనివారం రాణించాయి. మిర్జా ఇంటర్నేషనల్ షేర్లు 20 శాతం పెరగగా, బాటా ఇండియా షేర్లు 6.5 శాతం, లిబర్టీ షూస్ షేర్లు 7 శాతం లాభపడ్డాయి.
ఈ సెక్టార్లు డీలా రైల్వే, డిఫెన్స్
రైల్వేస్ కోసం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను ప్రభుత్వం పెంచకపోవడంతో ఐఆర్‌ఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్, ఐఆర్‌సీఓఎన్ వంటి షేర్లు శనివారం 10 శాతం వరకు పడ్డాయి. ప్రభుత్వం రూ.2.51 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను రైల్వేస్ కోసం బడ్జెట్‌లో కేటాయించింది. రైల్వే షేర్లు తమ ఆల్‌టైమ్ హై నుంచి కిందటేడాది 35 శాతం నుంచి 45 శాతం వరకు పడ్డాయి. ఆ తర్వాత కొంత రికవర్ అయినా, శనివారం మళ్లీ భారీగా నష్టపోయాయి. బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగినా, డిఫెన్స్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
ఎల్‌పీజీ సబ్సిడీ పెంచకపోవడంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు శనివారం నష్టాల్లో ముగిశాయి. ఈ కంపెనీలకు ఎల్‌పీజీ అమ్మకాలపై వచ్చే నష్టాలకు కాంపెన్సేషన్ ఇచ్చే ఆలోచనలో కేంద్రం లేనట్టు కనిపించింది. ఎల్‌పీజీ సబ్సిడీని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14,700 కోట్లు కేటాయించగా, 2025–26 కి గాను రూ.12,100 కోట్లు కేటాయించింది.
ఎరువులు, పవర్
ఎరువుల (ఫెర్టిలైజర్స్)పై ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వం రూ.1.68 లక్షల కోట్లకు తగ్గించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనా రూ.1.71 లక్షల కోట్ల కంటే ఇది తక్కువ. ఫెర్టిలైజర్ షేర్లు శనివారం భారీగా పడినా, ఇంట్రాడే నష్టాల నుంచి తిరిగి రికవర్ అయ్యాయి. కానీ, నష్టాల్లోనే ముగిశాయి. ప్రభుత్వ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కోసం ఎటువంటి ప్రకటనలు చేయకపోవడంతో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి షేర్లు శనివారం 5 శాతం మేర పడ్డాయి.