బడ్జెట్​ ప్రయత్నం బాగున్నా.. ఆచరణే కీలకం

బడ్జెట్​ ప్రయత్నం బాగున్నా.. ఆచరణే కీలకం

2025-26 కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలకి కొంత ఊరట కల్పించే విధంగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతన జీవులకు ఆదాయపు పన్నులో మార్పులు చేస్తూ ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. గతంలో ఉన్న పన్ను మినహాయింపు పరిమితి 7 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచడం జరిగింది.

 ఈ పన్ను రేటు మార్కెట్ ద్వారా మధ్యతరగతి ప్రజల్లో వినియోగ సామర్థ్యం పెంచుకునే అవకాశం మరింతగా పెరగనుంది. అదేవిధంగా కొన్ని పెట్టుబడులు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండబోతుంది. ఈ పన్ను మినహాయింపు ద్వారా వ్యక్తులతో పాటు ఎఫ్ఎంసీజీ రంగం కూడా పుంజుకోవడానికి ఆస్కారం ఉండనుంది. తద్వారా సమష్టి డిమాండ్ పెరిగి ఉపాధి పెరిగే అవకాశం కూడా ఉంది. 

వ్యవసాయ రంగానికి  కేంద్ర బడ్జెట్ కొంత ప్రాధాన్యతను కల్పించింది. రైతులకి సబ్సిడీ రుణాల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం ద్వారా దాదాపుగా ఎనిమిది కోట్ల మంది రైతులుప్రయోజనం పొందనున్నారు.  తద్వారా అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకునేవారికి ఉపశమనం లభించనుంది. 

పత్తి రైతుల కోసం ఐదేళ్ల మిషన్ ప్రాధాన్యంగా పెట్టుకొని నాణ్యమైన పత్తి ఉత్పత్తి, సరఫరా చేసేవిధంగా ఈ మిషన్​ను ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకు అధిక దిగుబడిని ఇచ్చే దానికోసం విత్తనాలపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ఈ బడ్జెట్​లో చేయడం జరిగింది. 

అంతేకాకుండా పీఎం ధన్ ధ్యాన్ కృషి యోజన ద్వారా దేశంలోని 100 జిల్లాలను కవర్ చేసి పంట దిగుబడిని పెంచేవిధంగా వివిధ కార్యక్రమాలను చేయడానికి కార్యాచరణ చేపట్టినట్టుగా పేర్కొన్నారు. పంటల మార్పిడి,  నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి.  కేంద్రం ప్రణాళికాబద్ధంగా అమలు చేసినట్లయితే రైతుల ఆదాయం పెరగొచ్చు.

క్రెడిట్​ గ్యారంటీల రుణం పెంపు

ప్రజలను ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తూ వివిధ రకాల పథకాలను తీసుకురావడం ఈ బడ్జెట్లో కనిపించింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీలను ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచడం జరిగింది. 

దీనిద్వారా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్నవారికి సులభంగా మూలధనాన్ని పొందడానికి సహాయ పడుతుంది. ఇది కేవలం ఎంఎస్ఎంఈ ఎంటర్​ప్రైజెస్​కే  కాకుండా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పనకు ఊతమిచ్చినట్టు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రమ పోర్టల్​లో నమోదు చేసుకున్న సూక్ష్మ పరిశ్రమల కోసం కొత్తగా ఐదు లక్షల వరకు క్రెడిట్ సపోర్టు అందించేవిధంగా క్రెడిట్ కార్డును వారికి అందివ్వనుంది. ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే పది లక్షల కార్డులను జారీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రోజువారీ  కార్యకలాపాలకు నగదు అవసరమైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

వీధి వ్యాపారులకు రుణసౌకర్యం

 గతంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర నిధి పథకాన్ని విస్తరించి వారికి రూ.30 వేల వరకు రుణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న చిన్న వ్యాపారులు వారి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు. ఈ పథకం ద్వారా వారి  ఆర్థిక స్వావలంబనకు, స్వయం శక్తిగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. 

సూర్య యోజన పథకం

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రత్యామ్నాయంగా పునరుత్పాదకత ఇంధనాలపైన కేంద్ర ప్రభుత్వం  దృష్టి సారించింది.  ఆ దిశగా కీలక చర్యలు చేపట్టింది.  కేవలం పెద్దపెద్ద ఉత్పత్తి కేంద్రాలను
పెట్టడమే కాకుండా నివాస గృహాల స్థాయిలో సూర్య  యోజన పథకం ద్వారా ఉత్పత్తి చేసి,  విద్యుత్ ఉత్పత్తిని పెంచి దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేవిధంగా చర్యలు తీసుకున్నారు. 

గత బడ్జెట్ల కన్నా.. ఈ బడ్జెట్​ బెటర్​

కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్​లోని నిర్ణయాలు అన్నీ కూడా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంతోపాటు, ధరలను కూడా అదుపులో ఉంచేవిధంగా పరోక్ష చర్యలు ఈ బడ్జెట్​లో కనిపించాయి. కాగా,గత పది సంవత్సరాలలో పెట్టిన బడ్జెట్ల కన్నా నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేవిధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. 

ఈ ఆలోచనలు, కేటాయింపులు పూర్తిస్థాయిలో ఫలితాలను అందించాలన్నప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో  నిధులు ఖర్చు చేసినట్లయితే, ఫలితాలు ప్రజలకు ఎంతో లబ్ధిని ఇస్తాయి. ఇవాళ కేంద్ర ఆర్థిక సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ‘వి హబ్’ సాధించిన ప్రగతి అందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రయోజనాలు ప్రగతి కేంద్రంగా స్థానిక ప్రభుత్వాలు పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి.

విద్యకు పెరిగిన కేటాయింపులు

దేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి 2025–26 యూనియన్ బడ్జెట్​లో గత సంవత్సరంతో పోల్చినప్పుడు  పది నుంచి  పదిహేను శాతం వరకు కేటాయింపులు పెరగడం  ఆహ్వానించదగిన పరిణామం. ఈ కేటాయింపులతో పీఎంశ్రీ పాఠశాలలను మోడల్ స్కూల్స్​గా మార్చి జాతీయ విద్యా విధానాన్ని మరింత వేగంగా అమలు చేయడం, స్మార్ట్ క్లాస్ రూమ్​లో సైన్స్ ల్యాబ్స్​, డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టబోతున్నారు. 

ఉన్నత విద్యారంగంలో ఐఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలకు అదనపు నిధులు కేటాయించడం ద్వారా కొత్త ఆవిష్కరణ కోసం స్టార్టప్​లు, పరిశోధనలకు  ప్రోత్సహించే ప్రత్యేక రీసెర్చ్ గార్డ్​ను అందుబాటులోకి  తేవడం కూడా మంచి ప్రయత్నం. 

విద్యలో నాణ్యతకు ప్రోత్సాహం

అంతర్జాతీయ స్థాయిలో భారత్ విశ్వవిద్యాలయాల ప్రతిష్టను పెంచడానికి.. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అనడంతోవిద్యలో నాణ్యతను పెరగడానికి ఆస్కారం ఉంది.అంతేకాకుండా డిజిటల్ విద్యను మరింత విస్తరించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ఈ– లైబ్రరీలు, ఉచిత ఆన్లైన్ కోర్సులు, నేషనల్ డిజిటల్ యూనివర్సిటీలాంటివి విస్తరితం చేయనున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నైపుణ్యాలను పెంచేందుకు ఏర్పాటు చేసిన పీఎం కౌశల్ వికాస్ యోజన పథకానికి నిధులు కూడా పెంచారు.

కృషి ఉంటేనే ఫలితాలు

మొత్తం మీద ఈ బడ్జెట్​లో  ఔత్సాహికమైన నూతన యువ వ్యవస్థాపకులను ప్రోత్సహించడంతోపాటు, విద్యారంగంలో అభ్యాస నాణ్యతను పెంచడం, డిజిటల్ పరిజ్ఞానాన్ని విస్తరించడం, పరిశోధనలకు కొత్త ప్రోత్సాహకాలు కల్పించడం, ప్రాక్టికల్ స్కిల్స్​ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం కూడా చెప్పుకోదగ్గ అంశాలు. వీటన్నిటిని కూడా ఆచరణలోకి తీసుకువచ్చి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేవిధంగా కృషి చేసినప్పుడు మాత్రమే మెరుగైన ఫలితాలు వస్తాయి.  

మొత్తానికి కేంద్ర బడ్జెట్ కష్టపడి పనిచేసే అన్ని రంగాలలోని మానవ వనరులకు అవసరమైన ఆర్థిక భరోసాను రుణాల రూపంలో అందిస్తూ, ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడం కోసం కృషి చేశారని చెప్పొచ్చు. వస్తురూప సహకారాన్ని అందించినప్పటికీ ప్రజల జీవితాల్లో మెరుగైన ఫలితాలు రాకపోవడం ఆ తర్వాత కాలంలో నగదు బదిలీలు  నేరుగా తీసుకువచ్చి ప్రజలకు అందించిన పని కూడా మెరుగైన ఫలితాలు రాకపోవటంతో, ప్రజల్లో జవాబుదారీ తనం,  నేర్పరితనం పెంచడం కోసం రుణ సహాయం ద్వారా వారిని కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్​ ప్రయత్నించిందని చెప్పొచ్చు.

- కృష్ణారెడ్డి చిట్టెడి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్,హెచ్​సీయూ-