బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపులు సంబంధిత పరిమాణాత్మక విలువలను తెలియజేస్తుంది. రాబోయే సంవత్సరంలో చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాబడి, వ్యయాలు, రుణాలు, పలు రకాల లోట్లు, ఇతర ద్రవ్య ప్రవాహాలను ప్రదర్శించే పట్టికనే వార్షిక బడ్జెట్ అంటారు. ఇది ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంశాలను, విధానాలను తెలుపుతుంది. బడ్జెట్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంచనా వేయబడిన రాబడులు, అంచనా వేసిన వ్యయం.
రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను రెండు ఖాతాలుగా వర్గీకరించారు. అవి. 1. రెవెన్యూ ఖాతా 2. మూలధన ఖాతా
రెవెన్యూ బడ్జెట్/ ఖాతా: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలు అన్ని రెవెన్యూ బడ్జెట్లో చూపిస్తారు. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం భాగాలుగా ఉంటాయి.
రెవెన్యూ రాబడులు/ రసీదులు: పన్ను రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది.
పన్నుల రాబడి: కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పనులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడి సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి. 1. కార్పొరేషన్ పన్ను 2. ఆదాయం పన్ను 3. ఎగుమతి, దిగుమతి సుంకం 4. ఎక్సైజ్ సుంకం 5. జీఎస్టీ 6. కేంద్రపాలిత ప్రాంత పన్నులు.
పన్నేతర రాబడి: కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా లభించే పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి. ఇందులో 1. ప్రభుత్వరంగ సంస్థల లాభాలు, డెవిడెండ్లు 2. ప్రభుత్వానికొచ్చే వడ్డీలు 3. వాణిజ్యపర లాభాలు 4. ప్రభుత్వ సేవలు 5. బహిర్గత గ్రాంట్లు 6. ఇతర పన్నేతర రాబడి మొదలైన వి భాగాలు.
మూలధన బడ్జెట్/ ఖాతా: కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని క్యాపిటల్ బడ్జెట్ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందకు వస్తాయి. దీనిలో రెండు భాగాలుంటాయి. అవి.. మూలధన రాబడి, మూలధన వ్యయం.
మూలధన రాబడులు: కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం క్యాపిటల్ రాబడిగా చెప్పవచ్చు. ఇవి రెండు రకాలు.
1. మార్కెట్ నుంచి తీసుకొనే రుణాలు: ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు (మార్కెట్రుణాలు), చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు, ట్రెజరీ బిల్లుల రూపంలో రిజర్వు బ్యాంకు నుంచి చేసే రుణం. 2. విదేశీ ప్రభుత్వాల నుంచి, సంస్థల నుంచి సేకరించే రుణాలు ఈ రెండింటిలో మార్కెట్ నుంచి తీసుకునే రుణాలే అధికంగా ఉంటాయి.
2. రుణేతర రాబడులు: రుణేతర రాబడుల్లో ఎ. ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా బి. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సి. గతంలో ప్రభుత్వమిచ్చిన రుణాలను వెనక్కి తీసుకోవడం ద్వారా రాబడిని సమకూర్చుకుంటారు.
మూలధన వ్యయం: ప్రభుత్వ ఆస్తులను సృష్టించి, వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతాయి. 1. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం 2. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ కంపెనీలకు – కార్పొరేషన్లకు విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు 3. రక్షణ మూలధన వ్యయం దీనిలో భాగాలుగా ఉంటాయి.
భారతదేశ బడ్జెట్ రాబోయే సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వ రాబడులు, చెల్లింపులను మూడు ఖాతాలుగా చూపుతుంది. అవి.. సంఘటిత నిధి, అగంతుక నిధి, ప్రభుత్వ ఖాతా.
సంఘటిత నిధి: రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఈ నిధికి జమ చేస్తారు. ప్రభుత్వం ఖర్చు నిమిత్తం డబ్బు తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్నే సాధారణ బడ్జెట్ అంటారు. అదే విధంగా రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి.
పబ్లిక్ అకౌంట్/ ప్రభుత్వ ఖాతా: ప్రభుత్వ ఖాతాలో భారత ప్రభుత్వ రాబడి వ్యయాల గణాంకాలతోపాటు ఇతర లావాదేవీలు కూడా చేరి ఉంటాయి. అలాంటి లావాదేవీల్లో ఉద్యోగుల(ప్రావిడెంట్ ఫండ్) భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పీఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు.
ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఈ మొత్తానికి వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహా ఈ లావాదేవీలు జరపడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. దీన్నుంచి ఖర్చు చేసేటప్పుడు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు.
రెవెన్యూ వ్యయం: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి చేసే వ్యయం. ఇందులో 1. రుణాలపై వడ్డీ చెల్లింపులు 2. సబ్సిడీలు 3. రక్షణ వ్యయం మొదలైనవి భాగాలు. రెవెన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తులు సృష్టించబడదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి.
వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకిచ్చే గ్రాంట్లు, పింఛన్లు, పోలీస్, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి అందించే వ్యయం, ఆర్థిక సేవలు(వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి, రవాణా), సాధారణ సేవలు(పన్ను వసూళ్లు, విదేశీ వ్యవహారాలు), సాంఘిక సేవలు (విద్య, ఆరోగ్యం, ప్రచారం), పోస్టల్ డెఫిసిట్, విదేశాలకిచ్చే గ్రాంట్లు, రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటుగా వర్ణిస్తారు.
కంటింజెన్సీ ఫండ్ అకౌంట్/ ఆగంతుక నిధి: పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. తుపాన్లు, వరదలు, భూకంపాలు తదితర అత్యవసర సమయాల్లో పార్లమెంట్ ఆమోదం తర్వాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలోని కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం ఖర్చు చేయవచ్చు. అయితే, తర్వాత పార్లమెంట్ ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంటింజెన్సీ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని తిరిగి కంటింజెన్సీ నిధిలో జమ చేయాలి.
రెవెన్యూ లోటు: రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది.
రెవెన్యూ లోటు= రెవెన్యూ వ్యయం – రెవెన్యూ రాబడి (రెవెన్యూ వ్యయం – పన్ను + పన్నేతర రాబడులు)
రెవెన్యూ లోటును మూలధన ఖాతా ద్వారా భర్తీ చేస్తారు.
బడ్జెట్ లోటు: మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువైతే బడ్జెట్ లోటు ఏర్పడుతుంది.
బడ్జెట్ లోటు = మొత్తం వ్యయం– మొత్తం రాబడులు ( రెవెన్యూ వ్యయం + మూలధన వ్యయం) – (రెవెన్యూ రాబడులు + మూలధన రాబడులు)
బడ్జెట్ లోటును ఓవరాల్ బడ్జెట్ డెఫిసిట్ అంటారు.
బడ్జెట్ లోటును నూతన కరెన్సీ నోట్ల జారీ ద్వారా భర్తీ చేస్తారు.
కోశలోటు: బడ్జెట్ లోటులో గల లోపాన్ని తొలిసారిగా షెనాయ్, తర్వాత సుఖ్మాయ్ చక్రవర్తి ప్రస్తావించారు. బడ్జెట్ లోటును గణించేందుకు మూలధన రాబడుల్లో మార్కెట్ రుణాలు కలిపి చూపడమైంది. చక్రవర్తి కమిటీ ఈ మార్కెట్ రుణాలను మూలధన రాబడుల్లో చూపరాదని, ఫలితంగా బడ్జెట్ లోటు మార్కెట్ రుణాల ద్వారా భర్తీ చేసుకోవడానికి వీలు కాదని ప్రకటిస్తారు. కాబట్టి మూలధన రాబడుల నుంచి మార్కెట్ రుణాలు మినహాయించి కోశలోటును గణించవచ్చు.
రాబడి ఖాతాలో చూపబడిన ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులు ప్రభుత్వ రాబడి కావు. ఈ మేరకు రాబడి లోటు ఉన్నట్లే. అందువల్ల బడ్జెట్ లోటును ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులు కలిపితే కోశలోటు వస్తుంది.
కోశలోటు = బడ్జెట్ లోటు + మార్కెట్ రుణాలు లేదా
మొత్తం వ్యయం – (రెవెన్యూ రాబడులు + రుణేతర రాబడులు) లేదా
మొత్తం వ్యయం – రుణాలు కాని మొత్తం రాబడులు
ప్రస్తుతం ప్రభుత్వం సమగ్రమైన లోటు కొలమానం ఇదే. 1997–98 నుంచి ఈ కోశ లోటును గణిస్తున్నారు. దీనిని కొత్త రుణాలు తీసుకోవడం ద్వారా లేదా నూతన కరెన్సీ ముద్రణ ద్వారా భర్తీ చేయవచ్చు.
మానిటైజ్డ్ డెఫిసిట్: నూతన కరెన్సీ ముద్రించడం ద్వారా భర్తీ చేసే లోటును మారిటైజ్డ్ డెఫిసిట్ అంటారు. దీనివల్ల ద్రవ్య సప్లయ్ పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.
ప్రాథమిక లోటు: కోశ లోటుకీ వడ్డీ చెల్లింపులకీ మధ్య వ్యత్యాసమే ప్రాథమిక లోటు.
ప్రాథమిక లోటు = కోశ లోటు – వడ్డీ చెల్లింపులు లేదా
కోశలోటు = ప్రాథమిక లోటు + వడ్డీ చెల్లింపులు
ప్రభుత్వం రుణంలో వడ్డీ చెల్లింపులు పోగా ఎంత మొత్తం ప్రస్తుత వ్యయానికి అందుబాటులో ఉంటుందో తెలియజేసే దానిని ప్రాథమిక లోటు అంటారు.
దీర్ఘకాలికంగా బడ్జెట్లో లోటు ఉండటమే లోటు బడ్జెట్ విధానం.
బడ్జెట్లో మార్పులు
మన దేశంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయమని అక్వర్త్ కమిటీ 1921లో సూచించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేసి చూపిస్తున్నారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసులపై 2016, సెప్టెంబర్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా 2017–18 బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్తో కలిపి చూపుతున్నారు.
1. 2017–18 బడ్జెట్ను ఫిబ్రవరి 28కి బదులు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టారు.
2. 2017–18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపివేశారు.
3. 2017– 18 బడ్జెట్ ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయ వర్గీకరణను విడిచి పెట్టారు.