ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ సెషన్

  • ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
  • మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ సెషన్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత బడ్జెట్ సెషన్లో భాగంగా వచ్చే నెల 13 వరకూ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో ఈ నెల 31వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ప్రభుత్వం సభలో ఎకనమిక్ సర్వేను ప్రవేశపెడుతుంది. తర్వాత   ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చలు కొనసాగుతాయి. ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం తర్వాత ధన్యవాద తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాతి రోజుల్లో ఉభయ సభల్లో కార్యకలాపాలు విడివిడిగా కొనసాగుతాయి.