ఇవాళ్టి(జనవరి 31) నుంచి బడ్జెట్ సమావేశాలు

ఇవాళ్టి(జనవరి 31) నుంచి బడ్జెట్ సమావేశాలు
  • తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం, ఎకనామిక్ సర్వే రిపోర్టు 
  • రేపు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్  
  • ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి 
  • ఈ సెషన్ లో 16 బిల్లులను సభ ముందుకు తేనున్న కేంద్రం

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎకనామిక్ సర్వే నివేదికను విడుదల చేస్తారు. రెండో రోజైన శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్  ప్రవేశపెడతారు. 

ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం 16 బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. 

ఇందులో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. ఫైనాన్స్ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఆయిల్ ఫీల్డ్స్ చట్టాల సవరణ బిల్లులతో పాటు బాయిలర్స్, మర్చంట్ షిప్పింగ్, కోస్టల్ షిప్పింగ్ తదితర బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. 

పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్.. 

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల అజెండాను ప్రతిపక్షాలకు వివరించారు. 

మీటింగ్ లో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగొయ్, జైరాం రమేశ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతృత్వంలో సమస్యలను లేవనెత్తుతామని కాంగ్రెస్ లీడర్ ప్రమోద్ తివారీ తెలిపారు. 

రైతులు, నిరుద్యోగులు సహా ప్రజల సమస్యలన్నింటిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. వీఐపీల కారణంగానే కుంభమేళాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బీజేపీ పాలనలో మతపరమైన ఉత్సవాలన్నీ వీఐపీల సమ్మేళనాలుగా మారాయని విమర్శించారు.