బడ్జెట్‎లో ఆర్థిక సమతుల్యత పాటించాలి

బడ్జెట్‎లో ఆర్థిక సమతుల్యత పాటించాలి

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలకి అవసరమైన నిధులను కేటాయించి వాటిని మరింత పటిష్టంగా అమలు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. మహాలక్ష్మి విజయవంతంగా అమలు చేస్తూ ఉండటం,  రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ సరఫరాకు  ప్రాధాన్యత కల్పించి అమలు చేయడం జరిగింది. నేడు ప్రజల నుంచి మిగతా హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తుండడంతో 2025–26  బడ్జెట్ మొత్తం దాదాపు 3.12లక్షల కోట్లుగా ఉండడానికి అవకాశం ఉంది.  

వ్యవసాయం అంటే పండుగలా చేయాలని కోరుకుంటున్న రైతన్నకి  తాజా బడ్జెట్లో  అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులని ఆర్థికంగా బలోపేతం చేయడానికి,  సహాయ సహకారాలను అందించడానికి  ప్రకటించిన రైతు భరోసా పథకానికి అధికంగా నిధులు కేటాయించాలి.  రుణగ్రస్తులైన  రైతులందరికీ  రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం కోసం అవసరమయ్యే నిధులను కూడా కేటాయించి,  ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన కీలక సమయం ఇది. రైతులకు పంట నష్టం, పెట్టుబడి సహాయం భారమవ్వటం, పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు  ధర లభించక ఇబ్బందులు పడుతున్న 
 రైతాంగానికి బడ్జెట్​లో తగిన నిధులు కేటాయించాలి.  

మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు

గత  ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో  ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్మించి, అక్షాంశాలు,  రేఖాంశాల ద్వారా సరిహద్దులను నిర్ణయించి  భూ సమస్యలకు శాశ్వత  పరిష్కారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ  పది సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయలేదు.  నేటి ప్రభుత్వం భూభారతి  ప్రోగ్రాం ద్వారా అన్ని భూములను పూర్తిస్థాయిలో  సర్వే చేసి సరిహద్దులను కూడా  నిర్ధారించి రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో  భూ సర్వేకు అత్యధికంగా నిధులు కేటాయించే అవకాశం, అవసరం ఉంది.  రెండు దశాబ్దాలకు పైగా నిరాదరణకు గురైన విద్యారంగంలో  మెరుగైన సదుపాయాలను అందించడం కోసం  విద్యా కమిషన్ కి నిధులను కేటాయించాలి.  

ప్రభుత్వ పాఠశాలలు,  కళాశాలలను అభివృద్ధి చేసేందుకు  డిజిటల్ విద్యా విధానాలను  ప్రోత్సహించడం కూడా ఈ బడ్జెట్​లో ప్రాధాన్యం  సంతరించుకునే అవకాశం ఉంది.  మహిళా సాధికారత కోసం  రాష్ట్ర  ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేవిధంగా నిధుల కేటాయింపు, మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించడానికి కూడా ఆస్కారం ఉంది.  ఇటీవల  కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో  తెలంగాణ ప్రాంతంలోని వీ హబ్  గురించి  ప్రస్తావించింది.   అది సాధించిన విజయాలను గొప్పగా కేంద్రం  ప్రశంసించిన నేపథ్యంలో రాష్ట్ర 
ప్రభుత్వం  మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరిన్ని రాయితీలు ప్రకటించాలి.

ప్రపంచంతో  పోటీపడేవిధంగా విద్యారంగం

గత  పది  సంవత్సరాల కాలంలో  తెలంగాణ విద్యారంగం పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం  వరకు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.  కనీస సదుపాయాలు లేక అల్లాడిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడుతోంది. తెలంగాణ  ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల భర్తీని పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులను కూడా ఈ బడ్జెట్​లో సమకూర్చాలి. అంతేకాకుండా పాఠశాల నుంచి అన్ని కళాశాలల్లో కూడా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి. 

విద్యావ్యవస్థలో  కొత్త సబ్జెక్టుల ద్వారా,   కోర్సుల ద్వారా  తెలంగాణ విద్యార్థులు  ప్రపంచంతో  పోటీపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి  తగిన నిధుల కేటాయింపుతోపాటు,  మార్కెట్ అవసరాలకు అనుగుణంగా  నైపుణ్యాలను పెంపొందించేవిధంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించేందుకు  ప్రణాళిక తయారుచేయాలి.  మార్కెట్లో  వేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో వాటికి అనుగుణంగా యువతలో   నైపుణ్యాలను పెంపొందించేవిధంగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉపాధి అవకాశాలు 
మెరుగవుతాయి.  

వైద్యరంగానికి ప్రాధాన్యమివ్వాలి

ఉస్మానియా, గాంధీ హాస్పిటల్​కు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేవిధంగా నూతన భవనాలతోపాటు, ఆధునిక  వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర ప్రజల వైద్య అవసరాలు తీర్చాల్సిన బాధ్యత  ప్రజాప్రభుత్వంపై ఉంది. వైద్యరంగానికి నిధులను ఎక్కువగా  కేటాయించి  ప్రజా ఆరోగ్య పరిరక్షణలో  కీలక పాత్ర  పోషించాలి.  ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయాలంటే  పెద్ద ఎత్తున ఆర్థిక వనరుల అవసరం ప్రభుత్వానికి ఉన్నది.

 ఇప్పటికే మద్యం,  భూముల రిజిస్ట్రేషన్​ల పైన అత్యధికంగా పన్నులు ఉండటంతో వాటిని మరింత పెంచడానికి అవకాశం లేదు.  ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాల్సిన  అవసరం ఉంది.  తెలంగాణ రాష్ట్రం  ఆర్థిక పరిమితులను  అధిగమించి  వివిధ అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలకు నిధులను సమకూర్చుకోవడానికి  కొత్త మార్గాలను వెతకాలి.   ముఖ్యంగా వనరుల సమర్థ వినియోగం, పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.  

రాష్ట్రస్థాయిలో జీఎస్టీ, వ్యాట్  పెంచుకునే విధంగా పర్యవేక్షణను పటిష్టం చేయాలి.  పన్ను ఎగవేత దారుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అవసరమైన విధివిధానాలను అమలు చేసి సంక్షేమ పథకాలకు అవసరమైన ఆదాయాన్ని  కూడా పెంచుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్రంలో  అనధికార వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగానే జరుగుతాయి.  కాబట్టి, వాటిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

గ్లోబల్ టూరిజం హబ్‎గా హైదరాబాద్​

ప్రభుత్వ భూములు.. కబ్జాదారులు,   ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడి అవసరమైన మేరకు పారదర్శకంగా వేలం వేసి ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది.  అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ ఆస్తులను అభివృద్ధి చేసి రెంటల్ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా కృషి చేయవచ్చు. అంతేకాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలను చేపట్టి  ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వాటిని అభివృద్ధి చేసి ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.  

హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ టూరిజం హబ్‎గా మార్చి ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకుల ద్వారా  ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అధునాతన బస్సులు,  టూరిజం స్పెషల్  సర్వీసులు, మెట్రో,  బస్ ఇంటిగ్రేషన్  విధానం ద్వారా ఆదాయాన్ని  వృద్ధి చేసుకునే మార్గాలను  పెంపొందించుకోవాలి.  స్మార్ట్  అగ్రికల్చర్  హైటెక్  మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లకు  పెట్టుబడులు  తీసుకురావడం ద్వారా కొత్త  ఆదాయ మార్గాలను పెంచుకోవాలి.  ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. 

పెట్టుబడులతో ఆదాయం 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,  మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టును  కూడా  అభివృద్ధి  చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా నిర్మించబోయే  మెట్రో రూట్లల్లో  ప్రైవేటు భాగస్వామ్యంతో  కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.  అదేవిధంగా మెట్రో స్టేషన్ల  మధ్య  కమర్షియల్  యూనిట్స్,  షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి రెంటల్ ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉంది.   కేంద్ర ప్రభుత్వ నిధులు, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్మార్ట్ సిటీస్ మిషన్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ వంటి కేంద్రం పథకాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి.

 తెలంగాణ రాష్ట్రం తన ఆదాయాన్ని పెంచుకోవాలంటే  పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.  ప్రభుత్వ భూముల వాణిజ్యకరణ,  కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని సమర్థంగా వినియోగించుకోవడం, మౌలిక వసతుల అభివృద్ధి చేయడం లాంటి చర్యల ద్వారా 2025– 26 ఆర్థిక సంవత్సరంలో  రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం సాధ్యమవుతుంది.

 - చిట్టెడ్డి కృష్ణారెడ్డి,
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ