బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి. అలాగే ప్రజల అవసరాలను తీర్చే, ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా ఉపయోగపడాలి. అప్పుడే బడ్జెట్ ను సహేతుకమైనదిగా, నిర్మాణాత్మకమైనదిగా భావిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. కానీ ప్రతి బడ్జెట్ లో ప్రభుత్వం చెబుతున్న మాట ఒక్కటే.. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని. తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి స్వర్ణ యుగం అని చెబుతున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని 52 శాతం ఉన్న బలహీన వర్గాలకు ప్రతి బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు తక్కువే ఉంటున్నాయి.
2.1 శాతం కేటాయింపులు
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 52 శాతంగా ఉన్న బలహీన వర్గాలకు బడ్జెట్ లో మూడు శాతం కంటే తక్కువ నిధులను కేటాయిస్తున్నారనేది వాస్తవం. రూ. 2.90 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన 2023-–24 బడ్జెట్ లో బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించింది కేవలం రూ. 6,229 కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి కేటాయించింది 2.1 శాతం అన్నట్లు. గత మూడు బడ్జెట్లలో బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులు వరుసగా రూ. 4,356 కోట్లు, రూ. 5,552 కోట్లు, రూ. 5,697 కోట్లు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో మాత్రం బీసీల సంక్షేమానికి 30 వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు, బీసీ సబ్ ప్లాన్ కింద నిధులను కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ నిధుల కేటాయింపులో ఏ స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతుందో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే అర్థమవుతున్నది.
గళం విప్పక తప్పదా!
బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ కూడా చెల్లించలేకపోతున్నది. బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం బడ్జెట్ లో చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, నేతన్నలకు చేయూత బీమా, టెక్స్ టైల్ పార్కులు, గురుకులాల పెంపు అని మభ్య పెట్టే పథకాలతో మోసం చేస్తున్నది. ఈ బడ్జెట్ లో బీసీ సంఘాల ఏ ఒక్క ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ‘మేము ఎంతో మాకు అంత వాటా’ అనే బీసీల ఆకాంక్షను పట్టించుకోలేదు. బీసీలు తమ హక్కుల కోసం గళం విప్పకతప్పదు.
కార్పొరేషన్లకు కేటాయింపులేవి?
బీసీ కార్పొరేషన్ కు, ఎంబీసీ కార్పొరేషన్ కు నిధులు పెంచాలనే బీసీ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈ రెండు కార్పొరేషన్లకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేసింది లేదు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు గత బడ్జెట్ లో రూ. 600 కోట్ల నిధులు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో ఆ రెండు కార్పొరేషన్ల నిధుల ప్రస్తావనే లేదు.12 కుల ఫెడరేషన్ లకు, బీసీల వ్యక్తిగత రుణాల ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేకపోవడం చూస్తే ప్రభుత్వం బడ్జెట్ లో బీసీల సంక్షేమాన్ని విస్మరించినట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నది.
- డా. తిరునహరి శేషు, బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్