గులాబీ సర్కార్‌‌‌‌కు బడ్జెట్ బుగులు

టీఆర్ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర బడ్జెట్ అంచనాలు భారీగానే ఉంటున్నాయి. ప్రతి ఏడాది వాస్తవిక బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, ఏడాది తిరిగే సరికి బడ్జెట్‌‌‌‌లో కోతల మీద కోతలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిన నాటి నుంచి ఇదే తంతు. వివిధ కారణాల వల్ల ఒక ఏడాదో లేక రెండు దఫాలో ఇలా చేస్తే బడ్జెట్ మీద ప్రజలకు నమ్మకం ఉండేది.
కానీ ప్రతి ఏటా రాష్ట్ర సర్కారు ఇదే పద్ధతి ఫాలో అవుతుండటం వల్ల బడ్జెట్ అంటేనే ప్రజలకు భరోసా తగ్గిపోతోంది.

 

రాష్ట్రంలో బడ్జెట్‌‌‌‌ కసరత్తు ఫైనాన్స్‌‌‌‌ మినిస్ట్రీకి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు తగ్గిపోతున్న రెవెన్యూ, మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం, ఇంకోవైపు చేసిన అప్పులకు వడ్డీల కింద వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడం వెరసి బడ్జెట్‌‌‌‌ తయారీ ఆర్థిక శాఖ అధికారులకు తలనొప్పిగా తయారైంది. ప్రతి ఏడాది కేటాయించిన బడ్జెట్ మొత్తంలో రూ.30 వేల కోట్ల మేర కోతలు విధిస్తుండటంతో.. బడ్జెట్ తయారీ అనే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతోంది. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకునేందుకు బడ్జెట్‌‌‌‌ అంచనాలను ప్రతి ఏటా భారీగా పెంచుకుంటూ పోతున్నారు. 2014-–15 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.లక్షా 82 వేల కోట్లకు చేరింది. అంటే ఐదు సంవత్సరాల్లోనే బడ్జెట్ రెట్టింపు అయినట్లు మనకు కనిపిస్తోంది. కానీ, వాస్తవంలో మాత్రం అది జరగడం లేదు.

అంకెల గారడీలా మారిన బడ్జెట్

బడ్జెట్ అంచనాలను అంకెల గారడిగా మార్చి ప్రజలకు అనవసరమైన భ్రమలు కల్పించవద్దని ప్రతిపక్షాలు, ఫైనాన్షియల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ మొత్తుకుంటున్నా కేసీఆర్ సర్కార్ మాత్రం బడ్జెట్‌‌‌‌ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోతోంది. తీరా ఏడాది తిరిగే సరికి పెట్టిన బడ్జెట్‌‌‌‌లో దాదాపు రూ.ముప్పై వేల కోట్లను తగ్గించి లెక్కలను సరి చేస్తోంది. ప్రతి ఏడాది ఇదే విధానాన్ని రాష్ట్ర సర్కార్‌‌‌‌ అనుసరిస్తుండటంతో బడ్జెట్ అంటేనే ప్రజలకు నమ్మకం పోతోంది. ప్రభుత్వం మాత్రం ధనిక రాష్ట్రమనే గొప్పలకు పోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, రెండంకెల వృద్ధి సాధించామని కృత్రిమ అభివృద్ధిని చూపిస్తోంది. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రెవెన్యూ సమకూరకపోవడంతో అమాంతం లెక్కలను కుదిస్తోంది. గత ఏడాది రూ.లక్షా 30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం రూ.లక్ష కోట్ల మేరకు మాత్రమే రాబడిని సమకూర్చుకోగలిగింది. ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాలేదు. ప్రతి ఏడాదీ ఇదే జరుగుతోంది. దీంతో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కోతలు విధిస్తోంది. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్ పెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించలేకపోతోంది. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కావడం లేదు. అత్యవసర పథకాల కోసం ఇతర నిధులను కూడా మళ్లిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులను సొంత అవసరాల కోసం వాడుకుంటోంది. అత్యవసరాల కోసం విపరీతంగా అప్పులు చేస్తూ పోతోంది. కొత్తగా అప్పులు చేసేందుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో అప్పులు నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకు చేరుకోగా, వడ్డీల చెల్లింపుల రూపంలో ప్రతి నెలా రూ.1,200 కోట్ల ప్రజా ధనాన్ని
రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.

ప్రజలపై భారం మోపుతున్న రాష్ట్ర సర్కారు

రెవెన్యూ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అదనపు ఆదాయం సమకూర్చుకోవడం కోసం ప్రజలపై భారాలను రాష్ట్ర ప్రభుత్వం మోపుతోంది. భూముల క్రమబద్ధీకరణ, భూముల అమ్మకాలు, ఎక్సైజ్, ఆర్టీసీ చార్జీల పెంపు, విద్యుత్ బిల్లుల బాదుడు వంటి అంశాలను తెర మీదకు తెస్తోంది. ఇటువంటి కష్టకాలంలో బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది. మార్చిలో కొత్త బడ్జెట్‌‌‌‌ను ప్రతిపాదించాల్సి ఉంది. అందుకే శాఖల వారీగా అంచనాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. అయితే చాలా సీరియస్‌‌‌‌గా జరగాల్సిన ఈ ప్రక్రియ కాస్తా.. రెవెన్యూ లేకపోవడంతో నామమాత్రంగా మారింది. గతంలో అయితే బడ్జెట్‌‌‌‌ రూపకల్పన సమయంలో ఆర్థిక శాఖ మంత్రి, ఉన్నతాధికారులు కూర్చొని వివిధ శాఖల నుంచి ఆదాయ వ్యయాలు, ప్రతిపాదనలు స్వీకరించే వారు. కానీ, ఈ దఫా మాత్రం అలాంటి హడావుడి కనిపించడం లేదు. పేరుకు ఆర్థిక శాఖపైనే బడ్జెట్‌‌‌‌ తయారీ బాధ్యత ఉన్నా.. ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు మొత్తం తన సలహాదారులతో చర్చించి సీఎం కేసీఆర్ తీసుకుంటారు. అసెంబ్లీకి సమర్పించే చివరి నిమిషంలో గణాంకాలను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రతిపాదించిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉండటమే కాక అంచనాల్లో ప్రతి ఏడాది 30 వేల కోట్ల వరకూ తగ్గిస్తున్నారు. దీంతో బడ్జెట్ రూపకల్పనను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా చాలా తేలికగా తీసుకుంటున్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు తామెందుకు మెదడును కష్టపెట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నింటి వల్లా బడ్జెట్ కసరత్తు నామ్‌‌‌‌కేవాస్తేగా మారిపోయింది.

– డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు,అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్