
బడ్జెట్ అనేది నిర్ణీత సమయానికి చేయబోయే వ్యయాన్ని, దాని కోసం సమకూర్చే ఆదాయాన్ని సూచిస్తుంది. అలాంటి బడ్జెట్లో ఎన్నో రకాలున్నాయి. రాబడి వ్యయాలు, సరళత్వం, గడిచిన సంవత్సర కేటాయింపులు పరిగణనలోకి తీసుకొని, సంఖ్యను అనుసరించి, ఎన్నికలు, అత్యవసర సమయాలను బట్టి రకరకాల బడ్జెట్లను ప్రవేశపెడుతుంటారు.
రాబడి వ్యయాల బట్టి రెండు రకాలు
1. సంతులిత బడ్జెట్: రాబోయే సంవత్సరంలో చేసే వ్యయాలు, రాబడులకు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. అప్పుడు మిగులు గాని, లోటు గాని ఉండదు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తేనే సంతులిత బడ్జెట్ విధానాన్ని పాటించడానికి వీలవుతుంది.
2. అసంతులిత బడ్జెట్: రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు, రాబడులకు సమానంగా లేకపోతే అది అసంతులిత బడ్జెట్. అప్పుడు ప్రభుత్వ బడ్జెట్ ఎ. మిగులు బడ్జెట్ (వ్యయాల కంటే రాబడులు ఎక్కువ) బి. లోటు బడ్జెట్ (రాబడుల కంటే వ్యయాలు ఎక్కువ)గా ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం రుణాలు సేకరించి అసంతులిత
బడ్జెట్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, సేకరించిన రుణాలను ప్రయోజనకరంగా ఉపయోగించి ఆర్థిక వృద్ధిరేటును పెంచాలి. లేకుంటే అసంతులిత బడ్జెట్ విధానం ప్రమాదకరంగా మారి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
సరళత్వం బట్టి బడ్జెట్లు:
1. స్థిర బడ్జెట్: బడ్జెట్‌ను అమలు చేసే కాల పరిమితిలో మార్పు లేకుండా స్థిరంగా ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయి, అంచనా వేసిన బడ్జెట్ కార్యక్రమాల స్థాయి సమానంగా ఉంటుంది.
2. చర బడ్జెట్: అత్యవసర పరిస్థితులు కల్పించే మార్పుల వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థాయి మారుతుంది.
కాబట్టి అంచనా వేసిన బడ్జెట్ కార్యక్రమాల స్థాయికి ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయికి తేడా వస్తుంది. ఈ మార్పులకు అనుగుణంగా బడ్జెట్ అమలు విధానాన్ని మార్చితే దాన్ని చర బడ్జెట్ అంటారు. గడిచిన సంవత్సర కేటాయింపులు పరిగణన బట్టి ఆధారిత/ సాంప్రదాయ బడ్జెట్: గడిచిన సంవత్సర కేటాయింపుల ఆధారంగా వర్తమాన సంవత్సర బడ్జెట్ కేటాయింపు జరిగితే దానిని ఆధారిత బడ్జెట్ అంటారు. ఉదా: భారత్‌లోని బడ్జెట్.
జీరో బేస్డ్ బడ్జెట్: గత సంవత్సర కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు చేసేదే జీరో బేస్డ్ బడ్జెట్. అంటే ప్రతి సంవత్సరం 0 నుంచి కొత్తగా ఆలోచించి కేటాయిస్తారు. రాజీవ్‌గాంధీ కాలంలో వి.పి.సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు 1986–87లో భారత్‌లో జీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇది కొనసాగలేదు. ఉమ్మడి ఏపీలో 2000–01లో యనమల రామకృష్ణుడు దీన్ని ప్రవేశపెట్టారు. దీనిని దీర్ఘకాల బడ్జెట్‌కు ఉదాహరణగా చెప్పవచ్చు.
బడ్జెట్ల సంఖ్య బట్టి:
బహుళ బడ్జెట్: ఆర్థిక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ఉంటే అది బహుళ బడ్జెట్. భారత్‌లో 1924 తర్వాత రైల్వే, సాధారణ బడ్జెట్లను వేర్వేరుగా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇది బహుళ బడ్జెట్. కర్ణాటకలో 2011–12 నుంచి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2013–14లో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్(వ్యవసాయ కార్యచరణ ప్రణాళిక)ను ప్రవేశపెట్టారు.
ఏక బడ్జెట్: ఆర్థిక వ్యవస్థలో ఒకే ఒక బడ్జెట్‌ను ప్రవేశపెడితే అది ఏక బడ్జెట్. ఉదా: 2017–18 బడ్జెట్ నుంచి భారత్ అనుసరిస్తోంది.
పాలనా సౌకర్యానికి:
1. లేమ్‌డక్ బడ్జెట్: ఇది సంవత్సరంలోనే కొంత కాలానికి మాత్రమే సంబంధించి ప్రభుత్వ ప్రణాళిలను, విధానాలను ప్రతిబింబించే బడ్జెట్. బడ్జెట్లో సూచించే రాబడులు, వ్యయాల వివరాలు సంవత్సరంలోని కొంత కాలానికి మాత్రమే సంబంధించి ఉంటాయి. రాజకీయ, పరిపాలనా అనిశ్చితి పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తారు.
2. అనుబంధ బడ్జెట్: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు తదితర అత్యవసర సమయంలో ప్రధాన బడ్జెట్ కాకుండా అనుబంధ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి అమలు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ప్రభుత్వం (కార్యనిర్వాహక శాఖ) పన్నులు, ఫీజులు ద్వారా ద్రవ్యాన్ని వసూలు చేసినా, దానిని ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం పొందాలి. రాబోయే సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రస్తుత సంవత్సరంలో శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు దానిని చర్చించి ఆమోదించడానికి కొంత సమయం పడుతుంది. పూర్తి బడ్జెట్ ఆమోదించడానికి ముందు అవసరమైతే కొన్ని నెలలకు(సాధారణంగా రెండు నెలలకు, ఎన్నికల సంవత్సరంలో నాలుగు నెలల వరకు) తాము చేయబోయే వ్యయాన్ని శాసనసభ ఆమోదించేదే ఓట్ ఆన్ అకౌంట్, ఎలాంటి చర్చ లేకుండా దానిని లోక్‌సభ ఆమోదిస్తుంది. 2016 వరకూ ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం వల్ల చర్చించడానికి మార్చి నెల ఒక్కటే ఉండేది. కాబట్టి తప్పనిసరిగా పూర్తి బడ్జెట్‌తోపాటు ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే, 2017 నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి రెండు నెలలు సమయం ఉండటంతో బడ్జెట్ ప్రాసెసింగ్‌లో ఓట్ ఆన్ అకౌంట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అయితే, అది ఎన్నికల సంవత్సరమైతే ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టొచ్చు. ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం పూర్తి బడ్జెట్ స్థానంలో మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్‌ను ఎన్నుకొంటుంది. ఓట్ ఆన్ అకౌంట్‌నే తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల సంవత్సరంలో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌తోపాటు నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టారు.
ఇంటర్మ్ బడ్జెట్: ఎన్నికల సంవత్సరంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కొద్ది కాలానికి మాత్రమే ఉన్న ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్లాగ ఇందులో కూడా రాబడులు, వ్యయాలు పూర్తి సంవత్సర కాలానికి ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ఇందులో కూడా పన్ను మార్పులు చేయవచ్చు. అయితే, ప్రభుత్వం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రధాన మార్పులు, నూతన భారీ పథకాలు ప్రకటించదు. ఓటర్లను ప్రభావితం చేసే భారీ పథకాలను ఎన్నికల సంఘం కూడా ఆమోదించదు. తాత్కాలిక బడ్జెట్‌తోపాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మొదటి తాత్కాలిక బడ్జెట్‌ను షణ్ముగంశెట్టి 1947 ఆగస్టు నుంచి 1948 మార్చి కాలానికి ప్రవేశపెట్టారు. 1948లో షణ్ముగంశెట్టి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.