- నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఘటన
నిర్మల్ జిల్లా: రైతు ఇంటి దాబాపై ఎక్కిన దున్నపోతు కొద్దిసేపు హల్ చల్ చేసింది. అది అసలు ఎలా ఎక్కిందని ఆశ్చర్యపోతూ కిందకు దింపేందుకు ప్రయత్నించగా.. దిగేందుకు ససేమిరా అంటూ అక్కడే ఉండిపోయింది. పచ్చగడ్డి ఆశచూపుతూ.. కిందకు దింపేందుకు ఎంత ప్రయత్నించినా.. దున్నపోతు పట్టించుకోలేదు. దీంతో చివరకు క్రేన్ ను తీసుకొచ్చి దాని సహాయంతో కిందకు దింపారు.
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన దున్నపోతు ఆడెపు శేఖర్ అనే రైతు ఇంటిపైకి ఎక్కింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డాబా మెట్ల పైన పచ్చిగడ్డి ఉండడంతో తినడానికి వెళ్లిన దున్నపోతు పచ్చి గడ్డి తింటూ అదే క్రమంలో దాబా పైకి ఎక్కి అక్కడే ఉండిపోయినట్లు గుర్తించారు. రైతు శేఖర్ దున్నపోతుని కిందికి దింపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దున్నపోతు ఎంతకి కిందకి దిగకపోవడంతో శేఖర్ గ్రామస్తులకు తెలియజేయగా వి.డి.సి సభ్యులు భారీ క్రేన్ తెప్పించారు. పశు వైద్యుడి పర్యవేక్షణలో దున్నపోతుకు మత్తుమందు ఇచ్చి డాబా పై నుండి కిందికి సురక్షితంగా దించారు. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు వింతగా ఎగబడి చూశారు.